సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ఉరిమిన గులాబీ శ్రేణుల ఉత్సాహం, మరోవైపు జోరు వానలో రద్దీగా సాగిన రోడ్ షోతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ చౌరస్తా జనసంద్రాన్ని తలపించింది. ఉరుములు, మెరుపులతో జోరు వాన ముంచెత్తినా కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం ముందు నిలువలేకపోయింది. మూడో రోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి మొదలైన కేటీఆర్ రోడ్ షోకు జనాలు నిండిపోయారు. ఓవైపు జల్లులు కురుస్తున్నా… రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ధూంధాం ఆటాపాటలతో తడిసి ముైద్దెనట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి భారీగా చేరుకున్నా… ఒక్కసారిగా ముంచెత్తిన వానతో సమావేశాన్ని కేటీఆర్ రద్దు చేశారు. యూసుఫ్‌గూడ చౌరస్తాకు చేరుకోగానే అక్కడి నుంచి రోడ్ షో ద్వారా గులాబీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గంలోని గడపగడపలో గులాబీ దండును చేరవేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, మాగంటి చేసిన ప్రజా సేవకు జనాలు నీరాజనం పడుతుండగా, గులాబీ శ్రేణులు రోడ్డు షోలతో దూసుకుపోతున్నాయి. ఆదివారం యూసుఫ్‌గూడ డివిజన్ పర్యటనకు కేటీఆర్ వచ్చారు. కానీ అప్పటికే కిక్కిరిసిన జనాల నడుమ ఉత్సాహంగా ఆటాపాటలతో కార్యకర్తలు మునిగి పోయి ఉన్నారు. కానీ భారీ వర్షం నేపథ్యంలో జనాలకు ఇబ్బందులు కలుగకుండా సమావేశాన్ని రద్దు చేసి, ఈ నెల 8కి వాయిదా వేశారు. కేటీఆర్ సభ రద్దు కావడంతో శ్రేణులు ఇండ్లకు వెళ్లాలని స్థానిక నాయకులు సూచించారు. భారీగా తరలి వచ్చిన జనాలకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జోరువానలోనూ బీఆర్ఎస్కు నీరా‘జనం’
డివిజన్లో సాగుతున్న కేటీఆర్ రోడ్డు షోకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి జనాలు తరలివచ్చారు. కేసీఆర్ హయాంలో అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ… ఉద్యమ పార్టీకి నీరాజనం పలికారు. మాగంటి సేవలను గుర్తు చేసుకుంటూ జూబ్లీహిల్స్ వేదికగా సాగిన అభివృద్ధికి పట్టం కడుతామంటూ జనాలు ఉత్సాహంగా పాల్గొనగా… ఆదివారం రోడ్ షో సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డివిజన్లలోని అన్ని బూత్ లెవల్ కమిటీల నుంచి జనాలు పాల్గొనగా… గులాబీ నేతలు రోడ్ షోకు తరలించారు. యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జనాలు తరలివచ్చారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి తరలివచ్చిన శ్రేణులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో అందిన సంక్షేమ పథకాలను తలచుకున్నారు. పేదోడే లక్ష్యంగా హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలంటూ సాగుతున్న కాంగ్రెస్ బుల్డోజర్లను తలచుకుని ఆందోళన చెందుతున్నారు. యూసుఫ్‌గూడ వెంకటగిరి ప్రాంతంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా బృందం… మాగంటి సునీతను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. రైతు బీమా, రైతు బంధు, 24గంటల ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యకు సాయం వంటి సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలు మారిపోయాయని, అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ఇక యూసుఫ్‌గూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదికపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మళ్లీ కలుస్తా… : కేటీఆర్
జోరు వానలోనూ లెక్క చేయకుండా రోడ్ షోకు వచ్చిన జనాలకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షం కారణంగా డివిజన్లో జరగాల్సిన రోడ్డు షో వాయిదా పడిందన్నారు. కానీ త్వరలోనే మళ్లీ డివిజన్ ప్రజలను కలుస్తానంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.