మేడ్చల్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: ‘ప్రశ్నిస్తే దాడులు, కేసులు ఇది రేవంత్‌రెడ్డి పాలన అని మనకు టేం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు అనుచరులు, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ కార్పొరేటర్ దంపతులు సునీత రాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, చిన్నాయాదవ్, జేఎసీ వెంకన్నలను శుక్రవారం మల్కాజిగిరిలో కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పోలీసు అధికారులు గుర్తుపెట్టుకోండి.. అధికారం ఎవడి అబ్బసొత్తు కాదన్నారు. కట్టుబానిసలుగా పనిచేస్తున్న అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, మేం అధికారంలోకి వచ్చాక దానికి ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరించారు. రేవంత్ అయినా రేవంత్ తొత్తులైనా వదిలిపెట్టమన్నారు. తర్వాత జరిగే పరిణామాలకు డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. దాడులు చేసిన వారిని విడిచిపెట్టి దెబ్బలు తిన్న వారిపై కేసులు పెడుతున్నారు. గంట పాటు మల్కాజిగిరి చౌరస్తాలో గుండాగిరి చేస్తే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌కు ఏం అధికారం ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అధైరపడొద్దని, మీకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. మన పని మనం చేసుకుంటూ పోదామన్నారు.
కాంగ్రెస్ ఒక్క సీటు గెలువలేదన్నా అక్కసుతోనే హైదరాబాద్‌పై కక్ష కట్టారని, హైదరాబాద్‌లో ఎలాంటి దురాగతాలు లేకుండా ప్రశాంతంగా ఉంటే ఓర్వలేకపోతున్నారన్నారు. తొమ్మిదిన్నర్లేళ్లలో ఒక్కసారి కూడా కర్ఫూ లేకుండా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. అభివృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రెండు శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని, జీహెచ్ంఎసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతల సమస్య రాకుండా పాలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు లేకుండా పోతున్నాయన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడులు చేశారని, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి చంపివేస్తామని లైవ్‌లో చెబితే కేసులు పెట్టలేదని కేటీఆర్ ఆరోపించారు. పార్టీ పోస్టులను రీ ట్వీట్ చేస్తే శశిధర్‌ను అరెస్టు చేశారన్నారు. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, రీట్వీట్లు చేస్తున్న వారిని అరెస్టు చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. దేనికైనా సమయం వస్తుందని, అప్పటి వరకు ఓపికగా ఉందమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిపితే పార్టీ వచ్చి నిలబడుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎదుర్కొనే దమ్ము తమకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉందన్నారు.
మల్కాజిగిరిలో 53 వేల మేజార్టీతో గెలిచిన మర్రి రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి చేస్తుంటే ఓర్వడం లేదని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడి, అభివృద్ధి చేసి చూయించాలన్నారు. మల్కాజిగిరి అభివృద్ధికి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కార్యకర్తలకు అండగా మర్రి రాజశేఖర్‌రెడ్డి నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కార్పొరేటర్ దంపతులు సునీత రాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, జేఎసీ వెంకన్న, చిన్నాయాదవ్లను కేటీఆర్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్రెడ్డితో కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దాడికి సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. తమపైనే దాడులు చేసి తనపై 7 కేసులను పోలీసులచే నమోదు చేయించినట్లు రాము యాదవ్ కేటీఆర్‌కు చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంబీసీ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్, ఎమ్మెల్సీ శ్రవణ్, రాగిడి లక్ష్మారెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబిత, బద్దం పరశురాంరెడ్డి తదితరులు ఉన్నారు.