కవాడిగూడ, జూన్ 12: కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఇటీవల ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో గ్రేటర్ నాయకులు నాగుల విద్యాసాగర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా రూపొందించిన మెమెంటోను కేటీఆర్‌కు అందజేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఇంటింటికీ తెలియజేసి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడితేనే నగర ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుళ్లి ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలన్నారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ పార్టీని మరింత పటిష్టం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయిచాణక్యరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.