అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనలన్నీ గాలి మాటలేనని మరోసారి స్పష్టంగా తేలిపోయింది. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క మధ్య పొంతన లేని వివరణలతో తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
– సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ)
మూసీ పునరుజ్జ్జీవంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచార ఆర్భాటాలు, పేదల భూములే లక్ష్యంగా దౌర్జన్యాలను నిలదీసేలా అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. గతేడాది లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతల మాటలను ప్రస్తావించారు. మరీ ఆ లెక్కలు ఎక్కడివి? డీపీఆర్ లేకుండానే అంత భారీ అంచనాలను ఎలా చేశారు…? వేల కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తామని బెదిరించినప్పుడు లేని ప్రజా సలహాలు.. ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయని కేటీఆర్ నిలదీశారు. ప్రాజెక్టు వ్యయంపై పారదర్శకత లేదని, ఇదీ కేవలం రియల్ ఎస్టేట్ ధ్యేయంగా సాగుతున్న ప్రాజెక్టు అని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ వేదికగా సాగిన చర్చలో మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ప్రస్తావిస్తూ… అప్పుడు మేము చూపించింది కేవలం ప్రణాళిక మాత్రమేనన్నారు. ఇదీ ఫైనల్ డీపీఆర్ కాదన్నారు. అంటే ఇంతకాలం ప్రభుత్వం చెప్పిన అంకెలు, చూపిన గ్రాఫిక్స్‌కు శాస్త్రీయ ఆధారం లేదని, మంత్రుల మాటలతో వెల్లడైంది. ‘వచ్చే వారం రోజుల్లో డీపీఆర్ వెబ్సైట్లో పెడతాం.. అప్పుడు ప్రజలు చూసుకోవచ్చు’ అంటూ దాటవేసేలా వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన లెక్కలు చెప్పలేకపోయారు. బడ్జెట్ కేటాయింపులు, వ్యయంపై కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. ‘మూసీని అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. ఇందులో అనుమానమే అక్కర్లేదు.’ అని ఒక్క మాటతో చర్చకు ముగించే ప్రయత్నం చేశారు.
మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సభావేదికగా తీవ్ర గందరగోళానికి తెరదీసినట్లుగా అసెంబ్లీలో చేపట్టిన చర్చతో తేలిపోయింది. డీపీఆర్ సిద్ధం కాకుండానే, వేల ఇండ్లను కూల్చివేయాలని చూడటం, నిధులపై పొంతన లేని మాటలతో ఒకే ప్రభుత్వం భిన్న స్వరాలను అందుకున్నది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి ఇప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారని, ఇక్కడే కాంగ్రెస్ అసలు నాటకం బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు, పర్యావరణ అనుమతులు లేకుండానే కేవలం కమీషన్ల కోసమే ఈ మూసీ హడావుడి చేస్తున్న కాంగ్రెస్ రూపొందించిన డీపీఆర్ ఎక్కడా? అని ప్రశ్నించారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం అది ప్రణాళిక కాదని, డీపీఆర్ పూర్తయిందని, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని చెప్పడం, దానికి ప్రభుత్వ సంకల్పంపై అనుమానపడాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యాలన్నీ రాజకీయ వివాదాలను పక్క దారి పట్టించడంలో భాగమేనని స్పష్టమవుతున్నది.