దుండిగల్, ఏప్రిల్ 17: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘చలో వరంగల్ సభ’ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జీ రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో రాష్ర్టాన్ని బంగారుమయంగా మార్చారన్నారు.
‘స్వల్ప ఓటు శాతంతో మనం అధికారాన్ని కోల్పోయినా.. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీలేదు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకముందు తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి పూలమాలలు వేశారు.