Kothwalguda Eco Park | సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లో ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారీ ఐవరీ, అక్వేరియంతో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులను చేపట్టారు. 2023 అక్టోబర్ నాటికి 70 శాతానికి పైగా పనులు పూర్తవ్వగా, శాసనసభ ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచిపోయాయి. మిగిలిపోయిన కొన్ని పనులకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు అనేకసార్లు టెండర్లు కూడా పిలిచారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచింది. కానీ ప్రారంభానికి నోచుకోలేదు.
కనీసం కొత్త ఏడాదిలోనైనా పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ వంటి పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి గల కారణాలపై పలు విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరిగింది. దీంతో ఎట్టకేలకు స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు.. పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మహానగరంలోని జంట జలాశయాలకు సమీపంలో ఉన్న ఎకో టూరిజం పార్క్‌ను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.
పర్యాటకానికి అత్యంత కీలకం..
హైదరాబాద్ పర్యాటకానికి వన్నె తెచ్చే ఈ ప్రాజెక్ట్‌ను భారీ వ్యయంతో చేపట్టారు. పచ్చని పరిసరాలు, అతిపెద్ద పక్షిశాల, అక్వేరియంతోపాటుగా వినోద కేంద్రంగా తీర్చిదిద్దారు. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు వస్తున్నది. ఐవరీ, అక్వేరియం, బోర్డు వాక్స్, ల్యాండ్ స్కేపింగ్, వీకెండ్ క్యాపింగ్ వంటి సదుపాయాలతో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా నగరానికి తలమానికంగా నిలిచే ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలోనే ఉండటం, జంట జలాశయాలను కూడా చూసే వీలు ఉండటంతో ఈ ప్రాజెక్టు పర్యాటకానికి అత్యంత కీలకంగా మారనున్నది.కానీ ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారులు పనులను పూర్తి చేసేందుకు జాప్యం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే అందుబాటులోకి రావాల్సిన ఈ పార్క్…కొత్త ఏడాది వస్తున్నా.. పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి.