ఖైరతాబాద్, మే 31 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్పై లేదని సేవాలాల్ బంజారా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 ఎన్నికల ముందు లంబాడీల ఓట్లను రాబట్టేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తానని, మంత్రి పదవి, కార్పొరేషన్ల పదవులు, నిధులు కేటాయిస్తామంటూ రేవంత్‌రెడ్డి నోటికొచ్చిన హామీ ఇచ్చి.. మోసం చేశారన్నారు. ఆయన హామీలను నమ్మి ఓట్లు వేసి గెలిపించామన్నారు.
కానీ నేడు లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ విగ్రహాన్ని మూలాన విసిరేసినట్లు నల్లమల అడవుల్లో పెడుతానంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం సేవాలాల్ మహారాజ్ మందిరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆకాంక్షలను ఆంధ్రా పాలకుల కాళ్లకింద పెట్టి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. బంజారాల అస్థిత్వం ఉన్న బంజారాహిల్స్‌లో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తే పట్టించుకోని ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి సమయం, డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ఒకప్పటి ఇందిరా కాంగ్రెస్ ఏనాడో చచ్చిపోయిందని, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లంబాడీలకు రిజర్వేషన్ల ప్రకారం పది శాతం సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో గ్రేటర్లో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. మరో వైపు మంత్రి సీతక్క లంబాడీలపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, గత కొన్ని రోజులు నుంచి మంత్రి పదవీ రాకుండా అడ్డుపడుతూ వస్తున్నారని, తాజాగా సేవాలాల్ విగ్రహం సైతం పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆమె కుట్రలను తిప్పికొడుతామన్నారు. ఇటీవల ఆంధ్రా పార్టీలకు చెందిన జెండా కూలీలు ప్రొఫెసర్ నాగేశ్వర్రావుపై విమర్శలు చేస్తున్నారని, ఆయనకు బంజారా సంఘాలన్నీ అండగా నిలబడుతాయని తెలిపారు. ప్రొఫెసర్ ఎస్పీ నాయక్, లక్పతి నాయక్ పాల్గొన్నారు.