సిటీబ్యూరో: భూముల వేలానికి వ్యతిరేకం అంటూ నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీయే… అధికారంలోకి వచ్చిన తర్వాత కోకాపేట భూములపై ఆశల మేడలను కట్టుకుంటున్నది. అందుకు విలువైన కోకాపేట్ భూములను విక్రయించాలని హెచ్ఎండీఏను పురమాయిస్తున్నది. 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో కోకాపేట్ నియోపోలిస్ ప్రాజెక్టును చేపట్టింది.
అయితే ఇందులో మరో 24 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లు అందుబాటులో ఉండటంతో… వీటిని తాజాగా విక్రయించాలని భావిస్తున్నది. కోట్లు కురిపించిన కోకాపేట్ భూముల్లో మిగిలిన 24 ఎకరాల డెవలప్మెంట్ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్లాట్లను అభివృద్ధి చేస్తూనే మార్కెట్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ప్రభుత్వానికి నియోపోలిస్ వెంచర్ ద్వారా అంచనాల మేర ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును వేలం వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్ఎండీఏను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వెంచర్ పరిధిలో అభివృద్ధి పనులు సాగుతుండగా… 24 ఎకరాల పరిధిలో పనులు చివరి దశకు చేరుకోవడం కొత్త ఏడాదిలో విక్రయానికి సిద్ధం కానున్నాయి. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయిండం ద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.