సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ దుకాణాల ముందు ఎక్కడ చూసినా లబ్ధిదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. రేషన్ సరకుల కోసం వెళ్తే ఆ రోజంతా పని మానుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా రేషన్ సరకులను ఒకేసారి పంపిణీ చేస్తుండటమే దీనికి కారణం. మూడు నెలల సరకులను ఒకేసారి నమోదు చేస్తుండటంతో బయోమెట్రిక్ మిషీన్లు.. మొరాయిస్తున్నాయి.
దానికి తోడు లోఫ్రీక్వెన్సీ సమస్య మరింతగా వేధిస్తున్నది. దీంతో ఒక్కరికీ రేషన్ సరకులు ఇచ్చేసరికి పది నిమిషాల నుంచి అర గంట సమయం పడుతున్నదని డీలర్లు చెబుతున్నారు. లో ఫ్రీక్వెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, మిషీన్లు మార్చడమో ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేయడమో చేయకుంటే ఈనెలలో లబ్ధిదారులందరికీ సరకులు పంపిణీ చేయడం కష్టమవుతుందని చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని కోరితే స్పందించడంలేదని వాపోతున్నారు. మూడు నెలలకు సరిపడా సరకులు ఇవ్వాలంటే మిషీన్లు కూడా సరైనవి ఉండాలని అధికారులకు విన్నవించినా ఉన్నవాటితోనే సరకుల పంపిణీ పూర్తి చేయాలంటున్నారని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెలాఖరులోగా రేషన్ సరకుల పంపిణీ పూర్తయ్యే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు.
టోకెన్లు ఇస్తూ.. రోజుకు 20 మందికే..
లోఫ్రీక్వెన్సీ సమస్యతో రేషన్ సరకుల పంపిణీ ఆలస్యమవుతుండటం, లబ్ధిదారులు గంటల తరబడి దుకాణాల ముందు బారులు తీరుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో రోజుకు 20 మందికి టోకెన్లు ఇస్తూ సరుకులు సరఫరా చేస్తున్నారు. బేగంపేట సర్కిల్లోని దాదాపు 70 దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. రోజుకు 20 మందికే ఇవ్వడం వల్ల నెలాఖరు వరకు లబ్ధిదారులందరికీ పంపిణీ చేయడం సాధ్యం అవుతుందా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
దుకాణాదారులేమో నెలాఖరు దాకా సమయం ఉన్నది కాబట్టి.. పంపిణీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇలా రోజుకు 20 మందికి పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు బారులు తీరడం, సమయం వృథా కాకుండా ఉంటుందని అంటున్నారు. రోజంతా క్యూలో నిలబడే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇప్పటికైనా అత్యాధునిక మిషిన్లు సరఫరా చేస్తే రేషన్ దుకాణాల్లో ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. గంటల తరబడి రేషన్ దుకాణాల ముందు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. పనులు మానుకుని రోజంతా క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.