హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తన క్యాంపు కార్యాలయం కోసం స్థలం కావాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఈద్గా గ్రౌండ్లో తనకు తెలియకుండా, తనను పిలువకుండా సబ్‌స్టేషన్ కోసం శంకుస్థాపన శిలాఫలకం వేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ వేదికగా దానం నాగేందర్ మండిపడ్డారు. తాను చెప్పిన అంశాలను మంత్రి నోట్ చేసుకోవడం కాదని, గుర్తుపెట్టుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమంగా ఆరు అంతస్థుల భవనాలు నిర్మించారని, దానిని కూలగొట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
మూసారాం వంతెన పూర్తిచేయండి: కాలేరు
హైదరాబాద్ అంబర్‌పేటలో చే నంబర్ చౌరస్తాలో రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించి వాహనాల రాకపోకలు అనుమతి ఇచ్చారని, కానీ సర్వీసు రోడ్లు పూర్తవపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.మూసారాం బ్రిడ్జి నిర్మాణం నత్తనడక సాగుతున్నదని, రెండేండ్లు కావస్తున్నా 30 శాతం పనులు కూడా కాలేదని వాపోయారు. యుద్ధప్రాతిపదికన బ్రిడ్జిని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. వారితో పాటు జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, యసశ్వినీరెడ్డి, మట్టా రాగమయి, కూచుకుళ్ల రాకేశ్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కల్వంపల్లి సత్యనారాయణ, రామారావు పవార్, కోవా లక్ష్మి, చిట్టెం పర్ణితారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, జల్పల్లి రంగారెడ్డి తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.