బొజ్జ గణపయ్య దివ్య మంగళరూపాలను కనులారా వీక్షించే అద్భుత ఘట్టానికి భాగ్యనగరం సిద్ధమైంది. మంగళవారం కనులపండువగా సాగే గణనాథుడి శోభాయాత్రకు సర్వ సన్నద్ధమైంది. విభిన్న రకాల రూపాల్లో నవరాత్రులు అలరించిన గణనాథులు.. నేడు నిమజ్జన బాట పట్టనున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వినాయకుల ఊరేగింపులో ఆడి పాడి.. సందడి చేయనున్నారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
వినాయక ప్రతిమల నిమజ్జనానికి 468 క్రేన్లు, నగరవ్యాప్తంగా 73 బేబీ పాండ్లను ఏర్పాటు చేసింది. మొత్తం 15 వేల మంది బల్దియా సిబ్బంది భక్తులకు సేలందించనున్నారు. దాహార్తి తీర్చేందుకు జలమండలి 35 లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలకు స్వాగతం పలికేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక స్వాగత వేదికలను నెలకొల్పింది. భక్తుల కోసం అదనంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, బస్సులు నడవనున్నాయి.
– సిటీబ్యూరో
బాలాపూర్ నుంచి వచ్చే గణేషుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, నాగుల చింత, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వరకు జరుగుతుంది.
సికింద్రాబాద్ వైపు వచ్చే గణనాథులు ఆర్పీరోడ్డు, ఎంజేరోడ్డు, కర్బాలమైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ క్రాస్‌రోడ్డు, హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి ప్రధాన యాత్రలో కలుస్తాయి. చిలకలగూడ వైపు నుంచి వచ్చే యాత్ర గాంధీ దవాఖాన వద్ద నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవర్, నారాయణగూడ వై జంక్షన్, హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వద్ద ప్రధాన ర్యాలీలో కలువాలి.
ఉప్పల్ వైపు నుంచి వాహనాలు శ్రీరమణ జంక్షన్, 6 నం. జంక్షన్, తిలక్‌నగర్, శివం రోడ్డు, ఎన్సీసీ, విద్యానగర్ టీ జంక్షన్, హిందీ మహా విద్యాలయం, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్‌పురా, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు నుంచి వచ్చే ర్యాలీలో కలుసుకోవాలి. అలాగే దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్ వైపు నుంచి నల్లగొండ క్రాస్‌రోడ్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు మూసారాంబాగ్, అంబర్పేట్ మీదుగా హిమాయత్‌నగర్ వైపునకు వెళ్లి ప్రధాన ర్యాలీలో కలువాలి. అలాగే తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఫీవర్ ఆసుపత్రి వద్ద నుంచి ప్రధాన ర్యాలీలో కలువాలి.
టోలిచౌక్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్, ఓల్డ్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోవాలి. ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వైపు నుంచి నిరాంకారి వద్ద యాత్రలో కలువాలి. ఆసీఫ్‌నగర్ సీతారాంబాగ్, అగాపురా, గోషామహల్, అలాస్క, మాలకుంట జంక్షన్ నుంచి వచ్చే యాత్ర ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన యాత్రలో కలువాలి.
గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచే విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటారు. నిరంతర విద్యుత్, అదనపు లోడ్‌కు సరిపోయేలా 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు , 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 31, 160 కేవీఏ సామర్థ్యంతో కూడిన ట్రాన్స్ఫార్మర్లను 37 వరకు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు సాగే గణేశ్ విగ్రహాల శోభా యాత్ర కోసం సుమారు 55 కి.మీ మేర 11 కేవీ ఎల్ టీ కేబుల్స్‌ను, పోల్స్, కండక్టర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడితే విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్‌కు లేదా 100, 1912 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
నిమజ్జనం వీక్షించేందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్‌బండ్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వైపు, ఆదర్శనగర్ రోడ్డు, బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ జంక్షన్, ఎంఎంటీఎస్ స్టేషన్ (ఖైరతాబాద్)లో పార్కింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు (అన్ని టెర్మినల్స్ నుంచి చివరి రైలు) అన్ని మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉంచినట్లు ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ వర్గాలు తెలిపాయి. అలాగే భక్తుల కోసం గ్రేటర్ వ్యాప్తంగా ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
గణనాథుడి శోభాయాత్రలో భారీగా భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు అంటున్నారు. చిన్నా.. పెద్ద అందరూ నిమజ్జనానికి తరలివెళ్తుంటారు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండకుండా..వారిని నిరంతరం కంటకనిపెడుతూ.. ఉండాలని, లేదంటే వారు జనంలో తప్పిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అలాగే నిమజ్జనం తరలించే వాహనాలపై పరిమితికి మించి భక్తులు ఎక్కించడం మంచిది కాదని సూచిస్తున్నారు. నిమజ్జన యాత్రలో డ్యాన్సులు, సంగీతం శృతి మించకుండా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా విద్యుత్ తీగలతో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు శోభాయాత్ర సాగనున్నది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్రను ఉదయం 6.30 గంటలకు ప్రారంభించి.. .మధ్యాహ్నం 1.30 గంటలోపే నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జనానికి 468 క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద 38 క్రేన్లను అందుబాటులో ఉంచారు. 15వేల మంది బల్దియా సిబ్బంది నిమజ్జన ప్రక్రియలో పాల్గొని పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టనున్నారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో 52,270 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. రహదారుల మరమ్మతులు పూర్తి చేశారు.
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. నిమజ్జనం సందర్భంగా సోమవారం ఆయన డైరెక్టర్లు, సీజీఎం, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జనానికి 122 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శోభాయాత్ర జరిగే రూట్లలో 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్‌తో పాటు 33 చెరువుల వద్ద 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 73 బేబీ పాండ్స్‌ను, కొలనుల వద్ద 27 బోట్లను ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు మొబైల్, స్టాటిక్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు.