భాగ్యనగరం ఆధ్యాత్మిక సంద్రమైంది.. భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. మంగళవారం ఎటు చూసినా గణనాథుల కోలాహలం.. జయజయ ధ్వానాలతో నగరం పులకించిపోయింది. పార్వతీ తనయా..పాహిమాం.. గణపతి బప్పా మోరియా.. నామస్మరణలతో మార్మోగింది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు శోభాయాత్రగా బయలుదేరి.. వెళ్లొస్తా..వచ్చే ఏడాది మళ్లొస్తానంటూ.. గంగమ్మ ఒడికి చేరగా… వినాయకా.. వెళ్లి రావయ్యా..మళ్లీ రావయ్యా..అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జన క్రతువు మధ్యాహ్నం 1.37కి పరిపూర్ణమైంది. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఎన్టీఆర్ మార్గ్ కిక్కిరిసిపోయింది. కొందరు బారికేడ్లను తోసుకొని ముందుకొచ్చేందుకు ప్రయత్నించగా, వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక బాలాపూర్ గణేశ్ లడ్డూను వేలం పాటలో 30 లక్షల 1000 రూపాయలకు మాజీ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. అనంతరం గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4.30లకు నిమజ్జనం పూర్తయింది. ట్రై కమిషనరేట్ల పరిధిలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. నేడు సైతం నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశమున్నది. – సిటీబ్యూరో/ఖైరతాబాద్, బడంగ్‌పేట
నగరంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత సంతరించుకున్నది. ఉదయం నుంచే మండపాల వద్ద పూజలు నిర్వహించి.. గణనాథుడి విగ్రహాలను రథంపై ఊరేగించి.. హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కూకట్పల్లి తదితర చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల పొడవునా..విభిన్న రూపాల గణనాథులు బారులు తీరాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఉదయం 6.32 నిమిషాలకు ప్రారంభమై..సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పర్యటించిన సందర్భంగా గంట వరకు శోభాయాత్ర నిలిపివేయడంతో ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం11.46 గంటలకు ఎన్టీఆర్‌మార్గ్‌లోని క్రేన్ నం. 4 వద్దకు మహాగణపతి చేరుకోగా, తుది పూజల అనంతరం మధ్యాహ్నం 1.37 గంటలకు నిమజ్జనం చేయడంతో ‘మహా’ ఘట్టం ముగిసింది.
ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేయడమే లక్ష్యంగా ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయించేందుకు పోలీసులు నిర్వాహకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్లు స్వయంగా పర్యటించారు. బాలాపూర్ గణేశుడిని వేగంగా నిమజ్జనం చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. మధ్యాహ్నం 2 గంటల వరకే అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చేరుకుందంటే.. వాహనాన్ని ఎంత వేగంగా తరలించారనేది అర్ధమవుతున్నది. అలాగే ఖైరతాబాద్ గణేశుడిని సైతం నిర్దిష్ట సమయానికే నిమజ్జనం చేయించారు.
బాలాపూర్ గణపతికి ఉదయం 5.30 గంటలకు గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసి.. నిమజ్జన యాత్రను ప్రారంభించారు. ప్రధాన కూడలికి గణనాథుడు చేరుకున్నాక.. 10.35 గంటలకు లడ్డూ వేలం పాటను ప్రారంభించారు. లడ్డూ వేలం కాగానే బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, శాలిబండ, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజేమార్కెట్, నాంపల్లి మీదుగా హుస్సేన్‌సాగర్‌కు తరలించి.. మధ్యాహ్నం 4.30 గంటలకు గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, నగర సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో నిమజ్జన ప్రక్రియను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. అనేక మంది ఖైరతాబాద్, లక్డీకాపూర్ మెట్రో స్టేషన్ల వరకు వచ్చి..అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. దీంతో ఎన్టీఆర్ మార్గ్‌కు సమీపంలో ఉన్న ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఒక్కసారిగా ప్రయాణికులతో నిండిపోయింది. 10 నిమిషాలకోసారి గేట్లు తెరిచి.. ప్రయాణికులను లోపలికి అనుమతించారు. మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విఘ్నాలు లేకుండా నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. 25 వేల మందికి షిప్టుల వారీగా విధులు కేటాయిస్తూ..ప్రధాన విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా సీపీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనాలను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా, కాముని చెరువు, తొండుపల్లి చెరువు, రాయ సముద్రం చెరువు, గంగారం చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి పరిశీలించారు.