Ganesh Immersion | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేశుడికి బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఇక ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
గణేశ్ నిమజ్జన కార్యక్రమం కోసం హైదరాబాద్లో 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్ది జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి. దాదాపు 48 గంటల పాటు సాగే ఊరేగింపును 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు.