Khairatabad Ganesh | ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 : ఖైరతాబాద్‌లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టంలో ప్రధానమైన శోభాయాత్ర శోభాయామనంగా ప్రారంభం కానున్నది. మహాగణపతి 71 సంవత్సరాల ప్రస్తానంలో ఈ ఏడాది 69 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. భారీ విగ్రహాన్ని తరలించేందుకు ఆనావాయితీగా ఈ ఏడాది కూడా భారీ ట్రాలీ రథసారథిగా నిలుస్తుంది. దశాబ్దాలుగా మహాగణపణి శోభాయాత్రకు ఉచితంగా వాహనాన్ని అందిస్తున్న ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏడాది కూడా తన సేవలను కొనసాగిస్తున్నది. 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో 100 టన్నులు మోసే సామర్థ్యం ఉన్న 26 చక్రాల ట్రాలీపై 50 టన్నుల బరువున్న మహాగణపతి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈ భారీ వాహానానికి రథసారధిగా సూర్యపేట జిల్లా ముకుందాదేవులపల్లికి చెందిన మందాడి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
శోభాయాత్ర సాగుతుందిలా….
శుక్రవారం సీఎం దర్శనం నేపథ్యంలో ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగినా సమాయానికి శోభాయాత్ర, నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. కాగా, రాత్రి 12గంటలకు కలశ పూజ, ప్రతిమ ఉద్వాసన, మహాగణపతిని రవిక్రేన్స్ సాయంతో ట్రాలీపై ఉంచి వెల్డింగ్ నిర్వహించి, అలంకరణ పూర్తి చేస్తారు. 400 మంది పోలీసుల పహారాలో ఉదయం 6.30గంటలకు గణపతి ప్రాంగణం నుంచి శోభాయాత్ర ప్రారంభమై రాజ్‌దూత్ చౌరస్తా, బీఎస్ఎన్ఎల్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నిమజ్జన ఘాట్‌కు 11గంటల వరకు చేరుకుంటుంది. ఆనవాయితీగా ఈ ఏడాది కూడా క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.