కీసర, ఫిబ్రవరి 17 : తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామి వారు ప్రతినిత్యం భక్తులను ఆయన సన్నిధికి పిలిపించుకొని వారితో మంచి సన్నిత్వం, బంధాలను ఏర్పరుకొని భక్తుల కోరికలు తీర్చుతూ వారి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంటాడు. ప్రతి సంవత్సకం కార్తీకమాసం, శ్రావణమాసం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కాంతితో ఈ దేవస్థానం భక్తులతో కళకళలాడుతుంది. ఓం నమాశివయా, శంభోశంకర హరహర మహాదేవో అంటూ భక్తులు నామస్మరణ చేసుకుంటూ స్వామి వారిని దర్శించుకొంటారు.
శుక్రవారం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్ర్తాలను తీసుకొస్తున్న మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్
నేడు మహాశివరాత్రి పర్వదినం
మహాశివరాత్రి పర్వదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. ప్రధానంగా శివభక్తులు కీసరగుట్టకు విచ్చేసి జాగరణ పట్టుకొని రాత్రి ఇక్కడనే బస చేసి మరుసటి రోజు ఉదయం జాగరణ స్వామి వారి సన్నిధానంలో విడిచి స్వామివారిని దర్శించుకొని వెళుతారు. కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమముఖంగా ఉండటం ఒక విశేషం. కొండలు, గుట్టలు, శిథిలాలు, అవశేషాలు శిలాస్తంభాలు, విరిగిన కళాకృతులు దర్శనమిస్తాయి. తామరకొలను సమీపంలో ఒకచోట నందీశ్వరుడు శివలింగం ఉన్న దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. స్వామి వారి ఆలయం పక్కనే ఉన్న సీతమ్మ గుహకు వెళ్లే దారిలో కుడివైపు విఘ్నేశ్వరుడు, శివలింగం, ఒకే చోట దర్శనమిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దేవస్థానం వారు విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. కీసరగుట్టకు వెళ్లే మార్గంలోని రెసిడెన్షియల్ కళాశాల నుంచి కీసరగుట్టపై వరకు రకరకాల విద్యుత్ అలంకరణతో చక్కగా ముస్తాబు చేశారు.