సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: గ్రేటర్లో లంబోదరుడి లడ్డూకి విశేషమైన ఆదరణ వస్తున్నది. ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాల్లో ఆనవాయితీగా నిర్వహించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే అధిక ధరకైనా లడ్డూను మాత్రం తామే దక్కించుకోవాలన్నట్లుగా వేలం పాటను ఆకాశమెత్తుకు తీసుకెళ్తున్నారు. అలా ఏటా హోరాహోరీగా సాగుతున్న వేలం పాటలతో లడ్డూ ధరలు సరికొత్త రికార్డులను సొంతం చేస్తున్నాయి.
ఒకప్పుడూ లడ్డూ వేలానికి బాలాపూర్ గణనాథుడు మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పరిస్థితి నుంచి, ఇప్పుడు నగర వ్యాప్తంగా లడ్డూ వేలం పాటలు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నాయి. దీంతో ఊహించని రీతిలో లడ్డూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈసారి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తీ రిచ్‌మౌండ్ విల్లాస్‌లో నవరాత్రులు పూజలందుకున్న లడ్డూ కోసం నిర్వహించిన వేలం పాటలో కళ్లు చెదిరే ధరతో సొసైటీ సభ్యులు సొంతం చేసుకున్నారు.
రూ.కోటి 87 లక్షలకు సొంతం చేసుకోగా, గతేడాది కంటే రూ.62 లక్షల అధిక ధర పలికింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా చూసే బాలాపూర్ లడ్డూ వేలం కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సారి పోటీదారుల సంఖ్య తగ్గినప్పటికీ రూ. గతేడాది కంటే రూ. 3.01 లక్షల అధిక ధరతో రూ. 30.01లక్షలతో బాలాపూర్ స్థానికుడు, కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.