సమన్వయలోపం.. నిర్లక్ష్యం.. వెరసి..నిండు నూరేండ్ల విద్యా కుసుమాల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.. పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఉదయం..సాయంత్రం వేళల్లో పాఠశాలల ప్రారంభం..ముగింపు సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా గాడితప్పుతున్నది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు.. విద్యార్థుల ప్రాణాలను హరిస్తున్నాయి.. కన్నవారికి కడుపుకోతను మిగిలిస్తున్నాయి.
–
Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ వాహనాలను ఉదయం నుంచి రాత్రి వరకు సిటీ లోపలి ప్రాంతాలకు అనుమతించొద్దు. మినీ వాహనాలకు మధ్యాహ్నం వేళల్లో కొంత సడలింపునిస్తున్నారు. అయితే ఈ నిబంధన మూడు కమిషనరేట్ల పరిధిలో పకడ్బందీగా అమలు కావడం లేదు. యధేచ్ఛగా సిటీలోకి ఎప్పుడుపడితే అప్పుడు భారీ వాహనాలు ప్రవేశిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు ప్రారంభం, ముగింపు సమయంలో భారీ వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన కూడా పోలీసులు చేయడం లేదు. రాచకొండ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే పది రోజుల వ్యవధిలోనే హబ్సిగూడలో ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును పరిగణలోకి తీసుకొని సైబరాబాద్‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు నగరంలోకి రావద్దని గతంలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పక్కన పెట్టి కేవలం చలాన్లను వేయడమే పనిగా ట్రాఫిక్ విభాగం పనిచేస్తుందనే విమర్శలున్నాయి.
పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమలు ఎక్కువగా ఉండే ఉప్పల్, ఈసీఐఎల్, నాచారం తదితర ప్రాంతాల్లో లారీలు తిరుగుంటాయి. భారీ వాహనాలకు నిర్ణీత సమయం ఉండటంతో ఆ టైం ముగుస్తుందనే భావనతో లారీ డ్రైవర్లు వెనుకా ముందు చూసుకోకుండా అతివేగంగా నిర్లక్ష్యంగా వెళ్తుంటారు. ఆ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, వాటి గురించి పట్టించుకునే వారు ఉండరు. హబ్సిగూడ ప్రాంతంలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ప్రమాదాలకు లారీ డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం.
గురువారం మధ్యాహ్నం 3.45 నిమిషాల ప్రాంతంలో పాఠశాల నుంచి తన పిల్లలను స్కూటీపై తీసుకొని సంతోషి ఇంటికి బయలుదేరారు. హబ్సిగూడలో వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొడుతూ ముందుకెళ్లింది. దీంతో వెనుక కూర్చున్న సంతోషి పెద్ద కూతురు కామేశ్వరీ కిందపడటంతో లారీ చక్రాల కింద పడి తీవ్రగాయాలతో మృతి చెందింది. ఈ నెల 17న ఉదయం పాఠశాలకు పదో తరగతి చదువుతున్న రంగ సాత్విక ఆటోలో స్కూల్‌కు బయలుదేరింది. తార్నాక వైపు నుంచి వచ్చిన లారీ ఆమె వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆటో ముందున్న బస్సు కిందకు దూసుకుపోయింది. ఆటోలో ఉన్న ఆ విద్యార్థి మృతి చెందగా, ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ఉప్పల్ నుంచి వచ్చిన లారీని రాచకొండలో ఆపాల్సిందని రాచకొండ పోలీసులు అంటుండగా, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చిన లారీని హైదరాబాద్ పోలీసులు ఆపలేదని ఒకరిపై ఒకరు సమస్యను నెట్టేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై రాచకొండ ట్రాఫిక్ డీసీపీ మనోహర్‌తో మాట్లాడగా, రాచకొండలో భారీ వాహనాలను ఎంట్రీ కాకుండా మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నామని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు.