సిటీ బ్యూరో/జూబ్లీహిల్స్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొన్ని నెలలకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణ దళిత యువతకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కానుక అందించారు. తెలంగాణ దళిత యువత అన్ని రంగాల్లో ముందుండాలనే దృఢ సంకల్పంతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పేరిట ప్రపంచ స్థాయి హంగులతో భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో 27 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంతో పాటు 6 అంతస్థుల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ చొరవ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సంకల్పంతో అత్యాధునిక హంగులతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దళిత యువత నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు దోహదపడే దళిత విజ్ఞాన బాంఢాగారాన్ని ప్రారంభించకుండా కాలయాపన చేస్తోంది.
అంబేద్కర్ ఆశయాలకు అద్దం పట్టేలా రహ్మత్‌నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్‌లో 1500 గజాల స్థలంలో ఆధునిక హంగులు, అన్ని వసతులతో మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యయన కేంద్రాన్ని నిర్మించారు. అధ్యయన కేంద్రంలో మహారాష్ట్ర శిల్పులు చెక్కిన 27 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. 2 సెల్లార్లు, 2 గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు అంబేద్కర్ ఆచరించిన బౌద్ధం ఉట్టిపడేలా ఆరు అంతస్థుల భవనం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. మొత్తం నిర్మాణానికి రూ.28 కోట్లు వ్యయం అయ్యింది. ఈభవనంలో విశాలమైన సమావేశ మందిరం, గ్రంథాలయం, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు 300 మంది కూర్చొనే ఆడిటోరియం, శిక్షణార్థుల వసతి కోసం 13 గదులు ఉన్నాయి. అబ్బురపరిచే దళిత మ్యూజియంతో పాటు టెర్రస్‌లో అంబేద్కర్ విగ్రహానికి సరి సమానంగా కానిస్ట్యూషన్ పిల్లర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది.
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యయన కేంద్రం నిర్మాణం పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడంలో వక్రబుద్ధి చూపిస్తున్నది. ఇప్పటికే దేశంలోనే ఎక్కడాలేని విధంగా దళిత బంధు తీసుకొచ్చి వారిపట్ల మాజీ సీఎం కేసీఆర్ వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తే దళితుల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్తశుద్ధి మరింత పెరుగుతుందనే అక్కసుతోనే ప్రారంభించకుండా వదిలేశారని దళిత యువత ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి పలుసార్లు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఈ భవనం సందర్శనకే పరిమితమవుతున్నారు. అధ్యయన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఇస్తున్న వాగ్దానాలు గాలి మాటలుగానే మిగులుతున్నాయి. విజ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.