బడంగ్‌పేట, డిసెంబర్ 17: కేసీఆర్ ప్రభుత్వం కాలుష్యం లేని ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీకి అడ్డుకట్ట వేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఫార్మాసిటీ పనులు కొంత మేరకు పూర్తయ్యాయని, అన్ని రకాల చర్యలు తీసుకొని ఎవరికి ఇబ్బంది కలుగకుండా నిర్మాణం చేయాలని కేసీఆర్ కృషి చేశారన్నారు. ఎలాంటి కాలుష్యం రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేశామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, పాక్స్ఖాన్ కంపెనీతో పాటు 52 కంపెనీలు తీసుకువచ్చారని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్లు, పైపులైన్ పనులు, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. రావలసిన నిధులు తప్పకుండా తీసుకొస్తామని, అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రతి కాలనీకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు. తన గెలుపు కోసం పని చేసిన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు శోభా ఆనంద్ రెడ్డి, యాతం పవన్ కుమార్ యాదవ్, అర్జున్, రాంరెడ్డి, శివకుమార్, స్వప్న వెంకట్‌రెడ్డి, దీపిక శేఖర్ రెడ్డి, లలిత కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, స్వప్న జంగారెడ్డి తదితరులు ఉన్నారు.