సిటీబ్యూరో/ఖైరతాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉద్వేగభరితంగా సాగింది. అనేక ఆంక్షలు.. ఆటంకాలను అధిగమించి..అమరులను స్మరిస్తూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట అడుగులో అడుగేసి జనం కదం తొక్కారు. జై తెలంగాణ నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు.. ఇబ్బందులు సృష్టించినా.. మొక్కవోని దీక్షతో గులాబీ శ్రేణులు ముందుకు కదిలారు. ‘ఖబడ్దార్ తెలంగాణ ద్రోహుల్లారా’ అంటూ హెచ్చరిస్తూ.. గన్‌పార్క్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది.
తొలుత గన్‌పార్క్ వద్ద అమరులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి అమరజ్యోతి వరకు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ..ర్యాలీ సాగింది. ప్రతి ఒక్కరూ కొవ్వొత్తిని ఆకాశం వైపున చూపుతూ.. అమరజ్యోతి ఎదుట అమరుల పోరాటాలను యాది చేసుకున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, గ్రేటర్ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు బస్సులు, బైకులు, కార్లలో గన్‌పార్క్‌కు చేరుకుని మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వందలాది మంది శ్రేణులతో దారులన్నీ గన్‌పార్క్ వైపు సాగాయి. సాయంత్రం ఆరు గంటల కల్లా గన్‌పార్క్ ప్రాంతం బీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు.