ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ సర్కార్ వైద్య, ఆరోగ్యశాఖను అన్ని విధాలుగా బలోపేతం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి, ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం వంటి ఎన్నో సంస్కరణలు, ఆరోగ్య పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
వీటితో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ రంగ దవాఖానలైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానల పడకల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సధుపాయాలు, కొత్త భవనాలు, కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చి దవాఖానలను కార్పొరేట్‌కు దీటుగా బలోపేతం చేశారు. ఇందులో భాగంగానే స్టెమ్‌సెల్ ల్యాబ్ ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ హయాంలోనే పునాది పడింది. అవయవ దాతల సంఖ్య పదుల్లో, స్వీకర్తల సంఖ్య వేలలో ఉండటం వల్ల అవయవ మార్పిడి అవసరమున్న రోగులు పడుతున్న గోసను గమనించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్టెమ్‌సెల్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పలు మార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం,
అందుకు అవసరమైన స్థలాన్ని నిమ్స్‌లో కేటాయించడం వంటి చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు 2021లో నిమ్స్‌కు స్టెమ్‌సెల్ ల్యాబ్ మంజూరైంది. నాడు పురుడు పోసుకున్న ఈ ల్యాబ్ నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి నిరుపేద రోగుల కోసం ఏర్పాటు చేసి స్టెమ్‌సెల్ ల్యాబ్ ఈనెల 19న అందుబాటులోకి రావడంతో కేసీఆర్ సర్కార్ ఆశయం నెరవేరినైట్లెంది.
తులసి థెరపెటిక్స్ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు నిమ్స్‌లో కూడా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ చికిత్స విధానం యూఎస్‌లో విజయవంతమైందని, ప్రస్తుతం అక్కడ అందుబాటులో కూడా ఉందని వివరించారు. ఈ చికిత్సపై నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పలు పరిశోధనాత్మక అధ్యయనాలు జరిగాయని, ఇంకా జరుగుతున్నట్లు తెలిపారు. ఇటీవలే ఈ ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తదితర ప్రక్రియ మొదలైందని తెలిపారు.
స్టెమ్‌సెల్ ల్యాబ్‌లో మానవ శరీరానికి సంబంధించిన పలు రకాల మూల కణాలను అభివృద్ధి చేస్తారు. ఆ కణాలతో కూడిన ఔషధాన్నే ‘రీజనరేటివ్ మెడిసిన్’ అంటారు. దీనిని ఇంజక్షన్ ద్వారా అవసరమైన రోగులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ చికిత్స పద్ధతినే స్టెమ్‌సెల్ థెరపి అంటారని డా.బీరప్ప వివరించారు. యూఎస్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, నిమ్స్ వైద్యులతో కలిసి రోగులపై క్లినికల్ ట్రయల్స్ చేయనున్నట్లు తెలిపారు. ఎలుకలు, జంతువలపై జరపాల్సిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీబీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజి) ఫండ్‌తో నిమ్స్‌లో స్టెమ్‌సెల్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. స్టెమ్‌సెల్ థెరపి చేయడానికి యూఎస్‌కు చెందిన తులసి థెరపెటిక్స్ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకున్నాం. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌కు సంబందించిన ప్రక్రియ మొదలైంది. ఈ చికిత్స అందుబాటులోకి రావడానికి సుమారు సంవత్సర కాలం పట్టవచ్చు. ఈ చికిత్స అందుబాటులోకి వస్తే ముఖ్యంగా లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తులు, కార్డియోమయోపతి వంటి గుండె సంబంధిత రోగులు, కీళ్ల అరుగుదలతో బాధపడే రోగులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది.
– డా.బీరప్ప, డైరెక్టర్, నిమ్స్ హాస్పిటల్