సిటీబ్యూరో:సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ర్టానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నా… నగర అభివృద్ధికి, మౌలిక వసతులకు ఆమడ దూరంగా ఉండేలా చేశారు. విశ్వనగరానికి అవసరమైన వనరులన్నీ సమృద్ధిగా ఉన్నా… కేవలం స్వప్రయోజనాలతో నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, లబ్ధి పొందారే తప్పా… ఏనాడూ చారిత్రక నగర వారసత్వ మూలాలను పదిలం చేస్తూ, అభివృద్ధి పథంలో నడిపించే ప్రణాళికలను రూపొందించలేదు. అదే హైదరాబాద్ నగరానికి పెనుశాపంగా మారింది. కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఊపిరి పీల్చుకుంది. పునరుత్తేజంతో అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది. సమైక్య పాలనలో కొన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా, భూములకు డిమాండ్ తీసుకువచ్చేలా సమైక్య పాలకులు..
సైబరాబాద్‌ను నిర్మిస్తే.. విశ్వనగరమంటే ఒక మూలకు మాత్రమే అభివృద్ధి ఫలాలు కేంద్రీకృతం కాకూడదనే దృఢ సంకల్పంతో మహానగరాన్ని ముఖ్యమంత్రిగా అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేశారు కేసీఆర్.కేవలం రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆకాశాన్నంటే భవనాలు నిర్మిస్తే సరిపోదని, భావి తరాలకు భరోసానిచ్చేలా పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నెలవుగా తీర్చిదిద్దారు. ఇక నగర ప్రజలకు నిరంతర విద్యుత్, నీటి సరఫరాతో, మురుగు నీటికి పరిష్కారం చూపారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకట్టుకునేలా ఇండస్ట్రీయల్ ఏకో సిస్టంను డెవలప్ చేసి విశ్వనగరాభివృద్ధిలో తన వంతు పాత్రను పోషించిన కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
సరికొత్త శకానికి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త చరిత్ర, సరికొత్త శకానికి కేసీఆర్ ద్వారాలు తెరిచారు. కొత్త రాష్ర్టానికి రాజధాని అయినా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో వేలు పట్టి నడిపించారు. ఉమ్మడి పాలకులు కాసుల కోసం ఈ అందమైన నగరాన్ని విధ్వంసం చేస్తే.. ఒక్కొక్కటిగా పునర్ నిర్మిస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. విభిన్న జీవన విధానాలు, విలక్షణ సంస్కృతుల మేళవింపులతో నిండి ఉన్న మహానగరాభివృద్ధికి కేసీఆర్ బాటలువేశారు. కేసీఆర్ దార్శనికతే హైదరాబాద్ నగరానికి శ్రీ రామ రక్షలా, నగరం రూపురేఖలు మార్చి విశ్వనగర కిరీటాన్ని అందించారు.
నీటి ఎద్దడి లేకుండా..
మహానగరంలో… సురక్షితమైన మంచినీటిని నిరంతరం అందించేందుకు జలమండలి వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించారు. నీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణా జలాలు నిరంతరం నగరంలో ప్రవహించేలా రింగ్ మెయిన్ ప్రాజెక్టును చేపట్టారు. అవుటర్ చుట్టూ వాటర్ రిజర్వాయర్లను నిర్మించి నగరానికి అవసరమైన నీటి వనరులను సమకూర్చారు. వీ హబ్, టీఎస్ బీపాస్, పరిశ్రమలకు రోజుల వ్యవధిలో అనుమతులిచ్చేలా టీఎస్ ఐపాస్ వంటివన్నీ కూడా కేసీఆర్ మేథోమధనం నుంచి వచ్చినవే. ఒకనొక సమయంలో ప్రధాని మోదీ నగరాభివృద్ధికి చిల్లి గవ్వ కూడా కేటాయించకపోయినా…రాష్ర్టాధినేతగా ఎక్కడా రాజీపడకుండా కేసీఆర్ చారిత్రక నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.
బలమైన పునాదులు…
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలకు ధీటుగా నగరాన్ని తీర్చిదిద్దారు. మహానగరంలో కరెంట్ కోతలకు స్వస్తి చెప్పి… 24గంటల కరెంటును సరఫరా చేశారు. దాదాపు 3వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లతో గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గ్రేటర్లో బస్సుల నిర్వహణ గుదిబండలా మారింది. అలాంటి సమయంలో జీహెచ్ఎంసీ ద్వారా ఒక ఏడాదిలోనే రూ.156.59 కోట్లు బదిలీ చేసి నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించారు.
నగరాభివృద్ధిపై గతంలో కేసీఆర్ ఏమన్నారంటే..
అన్ని నగరాల మాదిరి హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ కాకూడదు. అదే జరిగితే రాబోయే తరాలకు మనమే చేటు చేసిన వాళ్లం అవుతాం. హైదరాబాద్ నగరాన్ని హరిత నగరంలా తీర్చిదిద్దే ప్రణాళికలు ఇప్పుడు అత్యంత అవసరం. నగరంతోపాటు, నగర శివారుల్లో అర్బన్ లంగ్ స్పేస్ అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలి.
సమైక్య పాలనలో హైదరాబాద్ సర్వ నాశనమైంది. మహానగర మంచినీటి వ్యవస్థను పునర్ నిర్మించి చుక్కనీటికి ఇబ్బంది లేకుండా, కోటి జనం దాహార్తిని తీర్చేలా పరిష్కారం చూపాలి. ఇందుకు అనుగుణంగా శివారుల్లో 40 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణం చేయాలి. గోదావరి బేసిన్లో శామీర్‌పేట మండలం కేశవపురం, కృష్ణా బేసిన్లో చౌటుప్పల్ మండలం మల్కాపురం ప్రాంతాల్లో 20 టీఎంసీ చొప్పున భారీ రిజర్వాయర్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.
విశ్వనగరంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం.. జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్, మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు వంటి కనీస అవసరాలను కూడా తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. ఐటీఐఆర్, ఫార్మా సిటీ, నూతన పారిశ్రామిక విధానం, సినిమా సిటీ, స్పోర్ట్స్‌సిటీ వంటి అధునాతన హంగులు హైదరాబాద్ కేంద్రంగా వస్తున్న నేపథ్యంలో… మెరుగైన మౌలిక వసతులను కల్పించేలా ప్రణాళికలను అమలు చేస్తాం.
బ్రాండ్ ఇమేజ్ను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజల సహకారంతో అద్భుత నగరానికి రూపకల్పన చేసుకుందాం. అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న జనాలకు రెండింతల పరిహారం చెల్లించి, కడుపులో పెట్టి చూసుకుని నగరాభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుందాం. సమైక్య పాలకుల నిర్లక్ష్యపు ధోరణితో నగరంలో వర్షం పడితే పడవల్లో తిరగాల్సిన దుస్థితి వచ్చింది. ఇలాంటి ఇబ్బందులను తొలగించి, గ్లోబల్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలను క్రమంగా అమలు చేసుకుందాం.
సిటీకి చుట్టూతా 5 భారీ స్కైవేలను నిర్మించుకుని, రూ. 10వేల కోట్లతో నగర రహదారులను అభివృద్ధి చేసుకుందాం. దశల వారీగా నగరంలో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం. అదే విధంగా 24 అంతస్తుల్లో అధునాతన కమాండ్ కంట్రోల్ రూం నిర్మించి, హైదరాబాద్ వేదికగా యావత్ తెలంగాణ రాష్ర్టాన్ని మానిటరింగ్ చేసే ప్రణాళికలను అమలు చేస్తాం.