బడంగ్‌పేట, డిసెంబర్ 28: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కేసీఆర్‌ను దేవాలయాల అభివృద్ధికి, కుల సంఘాల భవనాల కోసం అడగకుండానే నిధులు కేటాయించి భవనాలు, దేవాలయాలను అభివృద్ధి చేయించారని ఆమె గుర్తు చేశారు. ఏదీ అడిగినా వెంటనే కేటాయించే వారన్నారు. లెనిన్ నగర్లో వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు చెప్పారు.
పక్కనే పేద ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు పేర్కొన్నారు. పది లక్షలతో గుడి నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి అందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అలాంటి మహానీయుని విగ్రహం చందన చెరువు కట్టపై ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ మధూసూదనాచారి మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి జ్ఞాన బోధన చేసిన గొప్ప వ్యక్తి వీర బ్రహ్మేంద్రస్వామి అని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలపై తిరుగుబాటు చేసిన మహాయోధుడు అని అన్నారు. బ్రహ్మంగారిని సంఘ సంస్కర్తగా ప్రపంచం గుర్తించిందన్నారు. కాగా, వేర్వేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీయూఎఫ్యూడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.