“ఐటీ ఉద్యోగి అయిన ప్రభుదాస్… ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఆయన్ను ఆ పార్టీకి అభిమానిని చేశాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన.. ఐటీలో వచ్చిన మార్పులను కళ్లారా చూశారు. ఈసారి బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడం, ముఖ్యంగా విదేశీ కంపెనీలను తీసుకురావడంలో ఐటీ మంత్రిగా కేటీఆర్ చూపిన చొరవ ప్రభుదాస్‌కు ఎంతగానో నచ్చింది. ఇదే విషయాన్ని తన తోటి ఉద్యోగులతో పంచుకుంటూ మదనపడ్డారు.”
“ యువతకు రోల్ మాడల్‌గా నిలిచిన కేటీఆర్ ఇన్నాళ్లు ఐటీ మంత్రిగా చేసిన పనులను గుర్తు చేసుకుంటూ… తెలంగాణ యువత నిన్ను చాలా మిస్ అవుతున్నారు అన్నా.. నా వయస్సు 23 ఏళ్లు. ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా ఏడవలేదు. కానీ ఈ రోజు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి” అంటూ బరువెక్కిన గుండెతో ట్వీట్ చేశారు.
“దశాబ్ద కాలంలో రాష్ర్టాన్ని అద్భుతంగా పాలించిన కేసీఆర్, కేటీఆర్ గారు.. మీకివే మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదీ నమ్మ శక్యంగా లేదు, హృదయ విధారకరమైన విషయం”
సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రజాతీర్పును శిరసావహిస్తూనే… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు పార్టీ అధిష్ఠానానికి వెన్నంటి ఉంటామని బీఆర్ఎస్ అభిమానులు పేర్కొంటున్నారు. ఆపద సమయంలోనే అండగా ఉంటామని చెబుతూ… సామాజిక మాధ్యమాల్లో వెల్లువలా మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తమ అభిప్రాయాలను ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఆరునూరైనా మీకు అండగా ఉంటామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేతతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అండగా ఉండాల్సిన బాధ్యత, సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెడుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వివరించారు. కొనసాగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాల వివరాలను పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఆపద సమయంలో అండగా ఉండాలని ప్రకటించారు. ‘తెలంగాణను నిజంగా ప్రేమించే నాలాంటి వారెందరో కలలో కూడా ఊహించని ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది’ అని ఓ యువకుడు పోస్టు చేస్తూనే.. రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దసారుకు దన్నుగా నిలుద్దాం అని రాసుకొచ్చాడు. ‘హుందాతనంతోని మీరు ప్రజా ఆదేశమని గౌరవిస్తున్నారు. బాధపడకండి, మనం తెలంగాణ రాష్ట్ర బాగు కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉందాం. పోరాటాలు, ఉద్యమాలు మనకేం కొత్త కాదు’ అని మరో యువకుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘ఓడిపోయింది అభ్యర్థులు మాత్రమే.. కానీ ఆ అభ్యర్థుల ధైర్యాన్ని ఏమాత్రం కాదు’.. ఈ రోజు ఓటమి.. రేపటి గెలుపునకు నాందిగా నిలుస్తుంది అని ఓ యువతి ధైర్యాన్ని మద్దతుగా ఇచ్చింది. ‘నిరంతరం శ్రమతో నూతన ఆలోచనలతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పుకున్న స్థితిలో నిలబెట్టిన నేతకు అండగా ఉండాలి’, నిజం తెలుసుకోవాలని అంటూ తమ, తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ప్రాణమున్నంత వరకూ గులాబీ జెండా వదిలేదే.. లేదు. మీరు మీ శాయశక్తులా పోరాడిన తీరు అమోఘం, నేను చాలా దగ్గరగా మిమ్మల్ని అనుసరించాను. మీ పనితనం గ్రేట్’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘గెలుపోటములు సహజమే అయినా.. ఉద్యమ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లకు అండగా ఉండాల్సిన సమయమిది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్లు కూడా ప్రాంతాలు, పార్టీలకతీతంగా బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన కంపెనీలు, జరిగిన అభివృద్ధి, కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ పనితీరు జనాలకు ఎంతగానో నచ్చింది. దీంతో స్వచ్ఛందంగా పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీతో, నేతలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నెట్టింట్లో పంచుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ ఓటమిని తమ ఓటమిగా భావించి మదనపడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ విషయంలో యువత స్పందిస్తున్న తీరు… సాధారణ ఓటర్లను కూడా పునరాలోచనలో పడేలా చేస్తోంది.