సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : అక్రమంగా తరలిస్తున్న రూ. 2.09 కోట్ల నగదును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాంధీనగర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఎన్నికలలో నగదు, మద్యం, బంగారం, వెండి అక్రమ రవాణాను నిలువరించేందుకు నగరంలో ముమ్మరంగా వాహనాల తనిఖీని చేస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, కవాడిగూడలో అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో రూ. 2.09 కోట్ల నగదు పట్టుబడింది. ఆధారాలు చూపకపోవడంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటు కారులో ఉన్న దినేశ్ కుమార్ పటేల్, సచిన్‌కుమార్ విష్ణు భాయ్ పటేల్, జితేందర్ పటేల్, శివరాజ్ నవీన్బాయ్ మోడి, మీట్ రాకేశ్ పటేల్, ఠాగూర్ నాజి ఛటర్జీ పట్టుబడ్డారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు తెలిపారు. ఇన్స్పెక్టర్ సైదులు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.
కూకట్‌పల్లిలో రూ.26.25 లక్షలు ..
కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీ కాలనీలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఏ ఆధారం లేకుండా తరలిస్తున్న రూ.26.25 లక్షల నగదును కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన రామకిషన్ (24), మంగతరావు సంతోష్ (35) సోమవారం ఉదయం కారులో కేపీహెచ్‌బీ కాలనీ రమ్యా గ్రౌండ్ మీదుగా వెళ్తున్నారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపి.. వాహనాన్ని తనఖీ చేశారు. కారులో రూ.26.25 లక్షల నగదును గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
జవహర్‌నగర్‌లో రూ.12 లక్షలు..
జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీసులు సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అంబేద్కర్‌నగర్‌లో ఎం. నాగప్ప వద్ద 4.50 లక్షలు, యాప్రాల్‌లో సారంగు సుధాకర్ వద్ద రూ.7,60,000ల నగదును పట్టుకున్నారు. సీజ్ చేసిన డబ్బును డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయంలో జమ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
మాదాపూర్‌లో రూ.32 లక్షలు..
మాదాపూర్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధి 100 ఫీట్ రోడ్డులో ఎస్ఓటీ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఓ కారులో రూ. 32 లక్షలు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.
మియాపూర్‌లో నగలు, నగదు..
మియాపూర్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోం జువెల్ వెనుక పైప్‌లైన్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా ఓ కారులో తరలిస్తున్న 16 కిలోల బంగారం, 23 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా.. సోమవారం ఉదయం ఆల్విన్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ ద్విచక్ర వాహనదారుడు బ్యాగులో రూ. 14 లక్షలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్‌లో రూ. 4.12 లక్షలు
మేడ్చల్: మేడ్చల్ పోలీసులు డబిల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిజామాబాద్ నుంచి నగరం వైపు వస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివ ప్రణయ్ వద్ద రూ.4.12 లక్షలు లభించాయి. అతడు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. డబిల్పూర్ చెక్‌పోస్టును సోమవారం డీసీపీ అంబరీష్ సందర్శించి, వాహనాల తనిఖీలను పరిశీలించారు.
జగద్గిరిగుట్టలో రెండు లక్షలు..
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసులు దేవమ్మబస్తీ సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గాజులరామారానికి చెందిన వ్యాపారి వెంకటేశ్ వద్ద రూ.2లక్షలు లభించాయి.
కుషాయిగూడలో రూ.30 లక్షలు..
చర్లపల్లి: కుషాయిగూడ పోలీసులు సోమవారం తాళ్లూరి థియేటర్ సమీపంలో నిర్వహించిన తనిఖీలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కాప్రాకు చెందిన నల్లా సతీష్‌కుమార్ వద్ద 30 లక్షల నగదు లభించింది.
ఎస్ఆర్ నగర్లో రూ.9,81,250..
వెంగళరావునగర్ : ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ. 9,81.250 నగదును ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన వివరాలను చెప్పకపోవడంతో సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.