మియాపూర్, నవంబర్ 10 : అవమానాలు లేవు.. అవహేళనలు లేవు.. ఛీత్కారాలు అసలే లేవు… కుటుంబ పోషణకు కూడళ్లలో చెయ్యి చాపాల్సిన అవసరం లేనేలేదు. బతుకు దెరువు కోసం బలవంతపు వసూళ్ల కోసం అర్రులు చాచాల్సిన దుస్థితి లేదు. సింహభాగం నడుస్తున్న బాటకు భిన్నంగా…తమ కాళ్లపై తాము గౌరవంగా జీవించేలా స్వయం ఉపాధి బాటవైపు వారి అడుగులు కదిలాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆ అడుగులు విజయం దిశగా ముందుకు పరుగెడుతున్నాయి. ఆ నడక తమలాంటి వాళ్లెందరికో ఆత్మగౌరవ జీవితపు బాటలుగా మారుతున్నాయి. సమాజంలో చిన్న చూపునకు గురవుతున్న ట్రాన్స్జెండర్లు ఇప్పుడు సగర్వంగా స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణను ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక చొరవ, ట్రాన్స్ఉమెన్ సొసైటీ తోడ్పాటుతో తొలి బ్యాచ్‌లో 16 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 45 రోజుల శిక్షణను 14 మంది ట్రాన్స్జెండర్లు విజయవంతంగా పూర్తి చేశారు. వారంతా ఇప్పుడు అదే ప్రాంగణంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలసరి వేతనం, ఉచితంగా అల్పాహారం, భోజనం, రవాణా వ్యయాలను పొందుతూ జ్యూట్ బ్యాగ్‌లను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. 9 నెలల కాలంలో 20వేలకు పైగా జూట్ బ్యాగులను తయారు చేసి, ఐటీ ప్రాంగణంలోని పలు ఐటీ కంపెనీల వద్ద స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ప్రాంగణం ద్వారా నెలకు గౌరవవేతనంతో పాటు గౌరవప్రదమైన జీవనాన్ని పొందుతున్నట్లు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వయం ఉపాధి అవకాశాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదే స్ఫూర్తితో తాజాగా ట్రాన్స్జెండర్లకు రెండో బ్యాచ్ జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ప్రారంభమైంది. ప్రాంగణం జిల్లా మేనేజర్ లక్ష్మీకుమారి పర్యవేక్షణలో జ్యూట్ బ్యాగుల తయారీ రెండో బ్యాచ్ శిక్షణకు పూర్తి స్థాయి వసతులు కల్పిస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
గౌరవప్రదంగా అనిపిస్తున్నది
కుటుంబ పోషణకు ఎన్నో ఇబ్బందులు పడ్డా. తెలంగాణ ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఉచితంగా జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణను అందించింది. దేశంలోనే ఈ తరహా శిక్షణ మొదటిది. శిక్షణ పూర్తి కాగానే… నెలసరి వేతనంతో ప్రాంగణంలోనే ఉపాధి కూడా కల్పించారు. ఇలా స్వయం ఉపాధితో జీవిస్తుండటం ఎంతో గౌరవప్రదంగా అనిపిస్తున్నది. మా ప్రయత్నాన్ని మున్ముందు విజయవంతంగా కొనసాగిస్తాం.
– సహస్ర, ట్రాన్స్‌జెండర్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీదారు