కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 15: భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, న్యాయస్థానానికి వచ్చే సామాన్యులకు నమ్మకం కలిగించి సత్వర న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ అన్నారు. గురువారం కూకట్పల్లి కైత్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన కూకట్పల్లి కోర్టు భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తులు సుజయ్ పాల్, సామ్కోసి, అభినంద్‌కుమార్ షావిలి, టి.వినోద్‌కుమార్, కె.లక్ష్మణ్, బి.విజయ్‌సేన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ రావు హాజరై కూకట్పల్లి కోర్టు సముదాయ భవనాలను ప్రారంభించారు. కోర్టు ఆవరణలో మొక్కలను నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలని, న్యాయం కోసం వచ్చిన వారికి సత్వర సేవలందించాలన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపింది న్యాయవాదులేనని, నేడు సమాజంలో మంచి కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కోర్టులో జడ్జిలతో పాటు న్యాయవాదులకు కూడా సమాన బాధ్యత ఉంటుందని, న్యాయవాదులు కొత్త ఒరవడిని సృష్టించి సత్వర న్యాయ సేవలందించాలన్నారు.
కేసులను త్వరగా పరిష్కరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం లభించినట్లన్నారు. కూకట్పల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న 43 వేల కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. అద్దె భవనంలో ప్రారంభమైన కూకట్పల్లి కోర్టు నేడు అధునాతన భవనంలోకి మారడం సంతోషకరమన్నారు. కోర్టు ఆవరణలో ఎకోఫ్రెండ్లీ వాతావరణాన్ని కొనసాగించాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడాలన్నారు. 2006లో ప్రారంభమైన కూకట్పల్లి కోర్టు.. అద్దె భవనం నుంచి సొంత భవనానికి చేరిందని, ఐదు అంతస్తులతో నిర్మించిన భవనాల్లో 14 కోర్టులు.. 3వ అదనపు జిల్లా న్యాయస్థానం (మేడ్చల్), సీనియర్ సివిల్ కోర్టు( మేడ్చల్), మేజిస్ట్రేట్ కోర్టులు 3 (మేడ్చల్), 6వ అదనపు జిల్లా న్యాయస్థానం (రంగారెడ్డి), సీనియర్ సివిల్ కోర్టు (రంగారెడ్డి), మేజిస్ట్రేట్ కోర్టులు 4 (రంగారెడ్డి)తో పాటు పోక్సో, ఫ్యామిలీ కోర్టులు పనిచేస్తాయన్నారు. భవనంలో ఈ సేవ కేంద్రాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, బార్ అసోసియేషన్ కార్యాలయం, క్యాంటిన్లను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, పలు విభాగాల అధికారులు, కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద గోవర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, న్యాయవాదలు పాల్గొన్నారు.