రవీంద్రభారతి,అక్టోబర్17: బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న సామాజిక ఉద్యమంలో రచనలు చేసే చారిత్రక బాధ్యతను బీసీ కవులు,రచయితలు, సాహితీవేత్తలు తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని పూర్వ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. బీసీల ఆర్థిక, రాజాకీయ, సామాజిక న్యాయాల హక్కుల సాధనకై సమస్థ బీసీ సమాజాన్ని కదలించేందుకు బీసీ సాహితీవేత్తలు, ఆటపాట మాటలతో గళాలు విప్పాలని కోరారు. శుక్రవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో సాహితీ విమర్శకుడు కేపీ అశోక్‌కుమార్ రచించిన తెలుగు సాహిత్యంలో బీసీ నవల అన్న విమర్శ గ్రంథాన్ని జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల కాలంలో 50 మంది రచయితలు రాసిన 60 బీసీ నవలలను వెలికితీసి వర్తమా చరిత్రకు అందించిన కేసీ అశోక్‌కుమార్ కృషి బహుజన సాహిత్య ఉద్యమానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఏ ఆస్తిత్వ ఉద్యమానికైనా భావజాలమే ప్రాణమని, బీసీల సామాజిక ఉద్యమానికి విరివిగా సాహిత్య సృష్టి జరగాల్సి ఉందన్నారు. రాజకీయ రంగాల్లో మాదిరిగానే కింద కులాల సాహిత్యాన్ని కళారూపాలను వెలుగులోకి రాకుండా చేస్తున్న కుట్రలను అధిగమించాల్సిన అవసరముందన్నారు. కేపీ అశోక్‌కుమార్ వందేళ్ల బీసీ నవలా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రొఫెసర్ డా.ఎస్ రఘు అధ్యక్షత వహించారు. కోయి కోటేశ్వరరావు, ఏకే ప్రభాకర్, గ్రంథ రచయిత కేపీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.