Jubleehills | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మంది కాగా, ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1,91,590 మంది, ట్రాన్స్జెండర్లు 25 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గంలో 1.61 శాతం మంది ఓటర్లు పెరిగారు. ఇక 80 ఏండ్ల వయసు పైబడిన వారిలో పురుష ఓటర్లు 3,280 మంది, మహిళా ఓటర్లు 2,772 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల వయసున్న వారు 6,106 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 1,891 మంది ఉన్నారు. ఇందులో చూపులేని వారు 519, శారీరక వైకల్యం ఉన్న వారు 667, వినికిడి లోపం ఉన్న వారు 311, ఇతర వైకల్యం ఉన్నవారు 722 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 95 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 139 లోకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉండగా.. సవరణల అనంతరం కొత్తగా 6,976 మంది ఓటర్లు చేరగా.. 663 మంది ఓటర్ల తొలగించబడ్డారు.