జూబ్లీహిల్స్: సర్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో ఈ నెల 24 వరకు పూర్తికావడం కష్టసాధ్యమని రెండు నెలల గడువు పెంచాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతా గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలన్నారు. అవగాహన లోపంతో ఎన్యూమరేషన్ ఫారంలు అందజేయలేకపోతున్నారని.. అవసరమైన ప్రాంతాల్లో సమాచార, అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శనివారం బోరబండ డివిజన్ మధురానగర్ కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను ఆమె ప్రారంభించారు. మాగంటి సునీతాగోపీనాథ్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులు ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అతిస్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద ప్రక్రియ చేపడుతుండడంతో 100 శాతం పూర్తికావడం ప్రశ్నార్థకంగా మారనుందన్నారు.
ఈ నేపథ్యంలో గడువును పొడిగించడం వల్ల అందరినీ ఓటరు జాబితాలో చేర్చడం అధికారులకూ సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. హెల్ప్‌డెస్క్‌లో ఎస్ఐఆర్ ఫారంలను ఎలా నింపాలో వివరించడంతో పాటు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమోహన్, జీవన్, డేవిడ్, అజయ, ఆంజనేయులు, సువర్ణ, మధు, మజీద్, మన్సూర్ పాల్గొన్నారు.
