KTR | పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు రాకూడదంటే సునీతమ్మను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కారు, బుల్డోజర్లు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోరబండలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వినాయక నగర్, ఎస్సార్టీ నగర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా హాజరయ్యారు. కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత మందితో నిండిపోయింద ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైడ్రా బాధితుల బాధను చూస్తే ప్రతి ఒక్కరికి కళ్లల్లో నీళ్లు వస్తాయన్నారు. హైడ్రా పేరుతో వేలాది మంది ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిందని కేటీఆర్ అన్నారు. హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేయాలని సూచించారు.
ప్రతి పేద వాడికి మేం అండగా నిలబడతాం.. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని స్పష్టం చేశారు. సునీతమ్మకు అండగా నేనున్నా.. కేసీఆర్ ఉన్నారు.. పక్కనే తెలంగాణ భవన్ ఉందని తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్దగంటలో మీ వద్దకు వస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు భయపెడితే.. మేం వచ్చి వాళ్ల సంగతి తేలుస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఒక్కరిని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టలేదని అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి రెండేళ్లైంది.. ఇంకా అమలు కావట్లేదని తెలిపారు. స్కూటీలు రాలేదు.. ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. రూ.4వేలు పెన్షన్ రాలేదు.. ఏ ఒక్క హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రేవంత్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే పేదల ఇళ్లు కూలగొట్టారు.. మహిళలను మోసం చేశారని.. హైదరాబాద్‌ను బర్బాద్ చేశాడు.. రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారు.. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్‌కు దిగజార్చారని అన్నారు.
రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయి కానీ.. పేదలకు ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని అన్నారు. తమ వద్ద నిధులు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా ఈ మాటలు చెప్పారని చెప్పారు. మరో ఎమ్మెల్యే వంద కోట్లు కావాలంటూ ప్రపంచ బ్యాంక్‌కు అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపారు. కంటోన్మెంట్లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. అక్కడ చేయని అభివృద్ధి.. జూబ్లీహిల్స్ ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. నోటిఫికేషన్లు లేవు కానీ.. లూటిఫికేషన్ మాత్రం చేస్తున్నారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలంటున్న నిరుద్యోగులను లాఠీలతో కొడుతున్నారని తెలిపారు. ఆడబిడ్డతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదని అన్నారు. మాగంటి గోపీనాథ్ గుర్తుకు వచ్చి సునీతమ్మ ఏడిస్తే.. కాంగ్రెస్ మంత్రులు ఆమెను అవమానించారని మండిపడ్డారు. కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తే దౌర్బాగ్యులు ఈ కాంగ్రెస్ నేతలని విమర్శించారు. ఏం చేసేది లేకపోతే.. కుర్చీలో ఎందుకు కూర్చున్నావని ప్రజలు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారని అన్నారు.