సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు జాబితా సవరణను విజయవంతంగా నిర్వహించామని, అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధుల అభ్యంతరాలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని గత నెల 30న నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను విడుదల చేశామని తెలిపారు.
జూబీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, సీపీ సజ్జనార్‌తో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 98వేల 982 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించినా, ఇంకా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినందున ఈ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య నాలుగు లక్షల పైచిలుకు ఉంటుందని కమిషనర్ వెల్లడించారు.
పోలింగ్ స్టేషన్లను కూడా ర్యాండమైజేషన్ చేసి 407కు పెంచినట్లు వివరించారు. సుమారు 139 లొకేషన్లలో ఈ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో వెంటనే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ ఆమల్లోకి వచ్చిందని కర్ణన్ తెలిపారు.
1950కి కాల్ చేసి..
నియోజవకర్గంలోని వివిధ పార్టీలు ఏర్పాటు చేసిన రకరకాల ప్రచార సామగ్రిని తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వీ కర్ణన్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో బూత్ లెవల్లో పోలింగ్ ఏజెంట్లను నియమించినట్లు వివరించారు. ఈ ఎన్నికలకు 600 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను మరో 600 మందిని అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. గత నెలాఖరులో జారీ చేసిన నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాలో ప్రతి ఓటరు తమ వివరాలను వెరిఫై కోసం 1950కి కాల్ చేసి చెక్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గురించి తెలుసుకునేందుకు నో యువర్ క్యాండీడెట్ను కూడా అందుబాటులోకి రానున్నదని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారెంతటి వారైన చట్టపరమైన కేసులు తప్పవని కర్ణన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో ఎపిక్ కార్డుతో పాటు భారత ఎన్నికల సంఘం ఆమోదించిన మరో 12 రకాల ఐడెంటిటీ పత్రాలతో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని సూచించారు.
ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటో
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లోని అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫొటోను ఓటర్‌కు కనిపించేలా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అభ్యర్థి కలర్ ఫొటో ఏర్పాటు చేయాలన్న నిబంధన ఈ ఉప ఎన్నికకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో 19 మంది నోడల్ ఆఫీసర్లు
పక్కాగా ఎన్నికల కోడ్ అమలు
సోమవారం నుంచే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. హైదారాబాద్ జాయింట్ సీపీ ఇక్బాల్, జీహెచ్ఎంసీ ఏఎస్పీ ఆధ్వర్యంలో సెక్టార్ల వారీగా తనిఖీలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్ స్కాడ్స్ 9, స్టాటిక్ సర్వైలైన్స్ 9, వీడియో సర్వైలైన్స్ రెండు, అకౌంటింగ్ టీమ్స్ నాలుగు, నిరంతరం 1950 కంట్రోల్ రూం పర్యవేక్షణ చేయనున్నారు.
ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు
-జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ జరగనున్నది. ఆర్వోగా సికింద్రాబాద్ ఆర్డీఓ శ్రీ సాయి రాం, ఈఆర్వీ/ఏఆర్వోగా జీఆర్ రెడ్డి (సర్కిల్-19 డీసీ), ఏఆర్వోగా సయ్యద్ యాహియా కమల్, ఏసీపీ ప్రసిద్ద, ఏఎంసీ బాలరాజ్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మహ్మద్ అజారుద్దీన్లు ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.
సంఘ విద్రోహ శక్తులపై నిఘా – సీపీ సజ్జనార్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హైదరాబాద్ పోలీసులు సంసిద్ధంగా ఉన్నట్లు నగర సీపీ సజ్జనార్ ప్రకటించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంఘ విద్రోహక శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నియమ, నిబంధనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యంగా మద్యం, నగదు పంపకాలపై ఉక్కపాదం మోపనున్నట్లు వెల్లడించారు. లైసెన్స్డ్ కలిగిన వారందరూ తమ ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలని సూచించారు.
పోలింగ్, కౌంటింగ్‌తో పాటు ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న సభలు, సమావేశాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్లు, ప్రతి కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఎంసీసీ ఉల్లంఘన జరిగిన, సమస్యాత్మకంగా అనిపించిన వెంటనే డయల్ 100కి గానీ, 112 గానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ ప్రజలను ఈ సందర్భంగా సూచించారు.
ఉప ఎన్నిక ఏర్పాట్లలో వేగం పెంచాలి
జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వీ కర్ణన్
జూబ్లీహిల్స్, అక్టోబర్ 6: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లలో వేగం పెంచాలని.. అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కేవీబీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్.. రిసెప్షన్.. కౌంటింగ్ (డీఆర్సీ) సెంటర్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.
యూసుఫ్‌గూడ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కేవీబీఆర్ స్టేడియం ఆవరణలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముసిగిన తరువాత బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను పకడ్బందీగా సిద్ధం చేయాలన్నారు. జూబ్లీహిల్స్‌లో కొత్తగా ఏర్పాటుచేస్తున్న 78 పోలింగ్ స్టేషన్లతో పాటు మొత్తం 407 పీఎస్‌లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈనెల 13న ఉప ఎన్నిక నోటిఫికేషన్.. నవంబర్ 11న పోలింగ్.. 14న కౌంటింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనున్నందున పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్సీ సెంటర్ నోడల్ ఆఫీసర్.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే.. ఐఏఎస్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్.. ఐఏఎస్, జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.
సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ): ఎన్నికల ప్రక్రియలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్లుగా సెక్టార్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించిన సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెక్టార్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, సరైన విద్యుత్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, రవి కిరణ్, ఎంసీసీ నోడల్ అధికారి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లు – 3,98,982
పురుషులు 2,07,367, మహిళలు 1,91,590, ఇతరులు 25
సర్వీస్ ఓటర్లు 18 – పురుషులు 15, మహిళలు 3
ఎన్ఆర్ఐ ఓటర్లు 95 – పురుషులు 80, మహిళలు 15
దివ్యాంగులు 1891 – పురుషులు 1106, మహిళలు 785
80 సంవత్సరాలు పైబడిన వారు 6052
పురుషులు 3280, మహిళలు 2772
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సరాసరిగా 980 ఓటర్లు
139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు, బీఎల్ఓలు 407, సూపర్వైజర్లు 38