Jubilee Hills By poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 31 నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం నుంచి నవంబర్ 9 వరకు పలుచోట్ల రోడ్‌షోలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్టోబర్ 31న షేక్‌పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, నవంబర్ 2న యూసుఫ్‌గూడ, నవంబర్ 3న బోరబండ, నవంబర్ 4న సోమాజిగూడ, నవంబర్ 5న వెంగళరావు నగర్, నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్లలో వరుసగా రోడ్ షోలు నిర్వహిస్తారు. నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు.
ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల వద్దకు వెళుతూ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు చేపడుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ఓటర్ల దృష్టికి తీసుకెళ్తూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు.