Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 7: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌లో సైతం పార్కులకు సరైన నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారంతో కంపు కొడుతున్నాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని పోలీస్ స్టేషన్‌కు సమీపంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో బొంబూస్ పార్క్ ఉంది. బల్దియాకు చెందిన ఈ పార్కులో భారీ వెదురు వృక్షాలతో పాటు యూకలిఫ్టస్ చెట్లు ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అనేక పార్కులను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని బొంబూస్ పార్కులో సైతం వందలాది మొక్కలు నాటారు. పార్కులో సందర్శకులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. అలాగే వాకర్ల కోసం మెట్లను, ట్రాక్‌ను నిర్మించారు, అయితే ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్కు నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో పార్కులో పిచ్చిమొక్కలు మొలిచాయి. ఇదిలా ఉంటే కొంతమంది ఆకతాయిలు పార్కు గేటు విరగ్గొట్టి లోపలికొచ్చి మద్యం సేవిస్తున్నారు. సమీపంలోని దుకాణదారులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది చెత్తాచెదారాన్ని తీసుకువచ్చి పార్కులో వేయడం ప్రారంభించారు. దీంతో బొంబూస్ పార్కు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది.
వీటన్నింటికీ తోడు పక్కనున్న భవనాలకు సంబంధించిన డ్రైనేజీ నీటిని పార్కులోకి వదిలిపెడుతుండటంతో మురుగు గుంట ఏర్పడింది. దీంతో తీవ్రమైన దుర్వాసనలతో పాటు దోమలకు నిలయంగా మారింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు పార్కు వైపునకు కన్నెత్తి చూడడం లేదని, చెత్తను శుభ్రం చేయాల్సిన శానిటేషన్ విభాగం సైతం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పార్కు ముందు నుంచి నిత్యం సీఎం కాన్వాయ్ వెళ్తుందని, ఇలాంటి ప్రాంతంలో పార్కు డంపింగ్ యార్డుగా మారినా అధికారులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం ఆశ్యర్యంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బొంబూస్ పార్కు నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.