కందుకూరు, డిసెంబర్ 31 : దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. శనివారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల అనుబంధ గ్రామం ఊట్లపల్లి నుంచి సుమారు 150 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ర్టాన్ని అభివృద్ధి చేసినట్లుగా దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో దేశం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. దేశ సమస్యలను గుర్తించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ పార్టీలకు ఇప్పటి నుంచే భయంపట్టుకుందని తెలిపారు. ప్రతి పక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సర్పంచ్ రామచంద్రారెడ్డి, కృష్ణారాంభూపాల్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.