ఉపాధి కల నెరవేర్చుకునేందుకు ఉచిత శిక్షణ: విప్ గాంధీ
మియాపూర్, మే 4 : నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్‌ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగార్థుల ఉపాధి కలను నిజం చేసుకునేందుకు నిపుణులైన వారిచే ఉచిత శిక్షణను అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో విప్ అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచితంగా అందివ్వనున్న పోటీ పరీక్షల శిక్షణకు సంబంధించిన గోడ పత్రికను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాదేవి, పూజిత గౌడ్, జూపల్లి సత్యనారాయణలతో కలిసి విప్ గాంధీ బుధవారం మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా మియాపూర్ క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 15వ తేదీన రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తాజా ప్రకటనతో కలిపి మొత్తం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసినట్లవుతుందన్నారు. నీళ్లు నియామకాలు అనే నినాదంతో స్వరాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా విజయవంతంగా అడుగులు వేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, రఘునాథ్‌రెడ్డి, సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, గౌతం గౌడ్, ఆదర్శ్‌రెడ్డి, పోశెట్టి, స్వామి నాయక్‌లు పాల్గొన్నారు.