సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయిందని అధ్యయనంలో గుర్తించింది. మరమ్మతులు జరిపాకే యథావిథిగా కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వొచ్చని, ఎక్కడెకక్కడ ఏం జరిగిందో వివరాలను పేర్కొంటూ 15 అంశాలతో కూడిన నివేదికను జేఎన్టీయూ బృందం సోమవారం జీహెచ్ఎంసీకి సమర్పించింది. గత నెల 16వ తేదీన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆరుగురు మరణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొకరికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇటీవల అందజేసింది. అయితే అగ్నిప్రమాద ఘటనతో ఐదు, ఆరు అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బ తిన్నాయనే అనుమానాలు, భవనం పటిష్టతపై జీహెచ్ఎంసీ జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణులతో పరీక్ష చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వప్నలోక్ భవనాన్ని జేఎన్టీయూ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం పలుమార్లు తనిఖీ చేశారు. ప్రమాదం 16న సంభవిస్తే, తర్వాత 18, 25, 31వ తేదీల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి భవనాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు.
భవనం సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, ఎనిమిది పై అంతస్తులు అపైన తొమ్మిదవ అంతస్తులో పాక్షికంగా సిమెంట్ రేకులతో నిర్మాణాలు ఉన్నాయని, ఈ భవనం రెండు బ్లాక్‌లతో ఉన్నట్లు తొలుత నిర్థారించింది. 5వ ఫ్లోర్ వెనుక భాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఈ ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమైంది. నిర్మాణానికి సంబంధించి చాలా చోట్ల పెచ్చులు ఊడుతున్నట్లు గుర్తించారు. ఆదే విధంగా 4వ అంతస్తు, రూట్స్లాబ్, అక్కడకక్కడ క్రాక్స్ వచ్చినట్లు గుర్తించారు. కొన్ని పిల్లర్లకు కాంక్రీట్ పెచ్చులుడుతున్నట్లు , ఇనుపచువ్వలు కూడా బయటకు వచ్చినట్లు తేల్చారు. ప్రమాదంలో 4, 5వ అంతస్తుల్లో పార్టిషన్ వాల్స్, స్లాబ్‌లలో నీటి లీకేజీలు ఉన్నట్లు, ఎక్కువగా ఈ రెండు ఫ్లోర్లు పూర్తిగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఆరవ ఫ్లోర్ వాల్స్‌లో క్రాక్స్ వచ్చాయని గుర్తించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి సెల్లార్ మినహా అన్ని అంతస్తుల్లో ఎలక్ట్రిక్ వైర్ పూర్తిగా కాలిపోయింది. 7వ అంతస్తులో కారిడార్ నిర్మాణం సరిగా లేదని తేల్చింది. కాగా జేఎన్టీయూ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిపుణుల సమక్షంలో భవన నిర్మాణ మరమ్మతులు జరిపిన తర్వాతనే భవనం నుంచి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.