వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 21 : విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తుందని, విద్యార్థి దశలోనే ఆవిష్కరణలు చేసేలా వారికి ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పని చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమం రాష్ట్రస్థాయి ప్రదర్శనలో భాగంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలను ప్రారంభిస్తామని, వీటి ద్వారా యువతరం పెద్దఎత్తున ఆవిష్కరణలు చేసేందుకు అనుకూలమైన వాతావరణం అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యా విభాగం కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఉంటూ తనతోపాటు రాష్ర్టాభివృద్ధికి కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఆవిష్కరణలు పాఠశాల స్థాయి నుంచి వచ్చేందుకు వీలుగా అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో వై హబ్ సీఈవో అపూర్వ భాస్కర్ దాస్యం, యునిసెప్ ప్రతినిధులు మురళీకృష్ణ, మాసన ప్రియ వాసుదేవన్, ఇక్వింలాబ్ ఫౌండేషన్ ప్రతినిధి సాహిత్య అనుమోలుతోపాటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులకు 2.25లక్షల నగదు బహుమతి
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ)తోపాటు పలు సంస్థలతో కలిసి నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 72 జట్లను ఎంపిక చేశారు. ఆయా జట్లలో రెండు రోజులపాటు ఇంటెన్సివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. వీరిలో అత్యుత్తమైన 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి, వారికి ట్యాబ్‌తోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మొదటి మూడు ప్రాజెక్టుల విజేతలకు మొత్తం రూ.2.25 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఇందులో మొదటి ప్రాజెక్టు ‘షూ’తో రైతులు విత్తనాలు నాటే ఆవిష్కరణను రూపొందించిన బండ్లగూడకు చెందిన విద్యార్థులకు రూ.లక్ష, రెండోది డాక్టర్లు రాసే ప్రిస్కిప్షన్‌ను ఈ-ప్రింటింగ్ చేసే ప్రాజెక్టును చేపట్టిన జీడిమెట్లకు చెందిన విద్యార్థులకు రూ.75వేలు, ఎమర్జెన్సీ మెడిసిన్ వెండింగ్ మెషిన్‌కు 3వ బహుమతి కింద రూ.50వేలను అందజేశారు.