ఖైరతాబాద్, జూన్ 1 : సరసమైన ధరకు ఫ్లాట్స్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించి రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మావర్మకుమార్, మూర్తి శ్రీనివాస్, ప్రసాద్ శివపురం, గణేశ్, ఫణిలు మాట్లాడుతూ 2021లో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జయ గ్రూప్)కు చెందిన కొందరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ తమను ఫోన్లో సంప్రదించారని, చందానగర్, గోపన్‌పల్లి, కూకట్‌పల్లిలోని తమ ప్రాజెక్టుల్లో అన్ని హంగులు కలిగిన ఫ్లాట్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని చెప్పారన్నారు.
అప్పటికే సదరు సంస్థ 20 ప్రాజెక్టులు చేపట్టిందని ప్రచారం చేయడంతో వారి మాటలకు ఆకర్షితులమై ఫ్లాట్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. చందానగర్‌లోని హిల్టన్ పేరిట ఉన్న ప్రాజెక్టును చూపించారని, సుమారు 800 ఫ్లాట్స్ ఉన్నాయని, ముందస్తుగా కొంత చెల్లిస్తే 2023 వరకు ఫ్లాట్స్ అప్పగిస్తామని చెప్పారన్నారు. దీంతో రూ. 20 లక్షల నుంచి రూ. 1.80 లక్షల వరకు 400 మంది చెల్లించారన్నారు. గడువు దాటినా ఫ్లాట్స్ అప్పగించకపోవడంతో తాము ఆ సంస్థ ఎండీని నిలదీశామన్నారు.
కొందరికి డబ్బులు వాపసు చెల్లిస్తామని, మరికొందరికి చెక్కులు అందించారని, అవి బౌన్స్ అయ్యాయన్నారు. అంతేకాకుండా ఆ ఫ్లాట్స్ చూపించిన స్థలం గురించి విచారణ జరుపగా, అది వేరే సంస్థకు సంబంధించిదని, ఆ సంస్థతో ఎంవోయూ చేసుకొని తమకు తప్పుడు ఫ్లాట్స్ చూపించి మోసగించినట్లు గ్రహించామన్నారు.
కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సంస్థ యజమానిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంస్థ ఎండీతో పాటు 10 మంది డైరెక్టర్లు సుమారు 1500 మంది వద్ద వసూలు చేసి రూ. 300 కోట్లకు పైగా మోసం చేశారని వెలుగుచూసిందన్నారు. పోలీసులతో పాటు ఈడీకి సైతం ఫిర్యాదు చేశామని, సదరు సంస్థపై విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలన్నారు.