బంజారాహిల్స్, ఆగస్టు 16: ప్రజారోగ్యం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడ్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు నీటిమూటలయ్యాయి. కోట్ల రూపాయల మాట అటుంచి అద్దెలు చెల్లించకపోవడంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు మూతపడే పరిస్థితి దాపురించింది. పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని రెండున్నర లక్షల అద్దె బకాయి చెల్లించలేక చేతులెత్తేశారు. ఒకవైపు ఇంటి యజమాని ఖాళీ చేయాలంటూ వేధింపులు.. మరోవైపు అద్దె బకాయి ఇవ్వలేమంటూ అధికారులు తేల్చిచెప్పడంతో పట్టణ ఆరోగ్య కేంద్రంలో సేవలు నిలిపివేశారు. స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం 5లోని జవహర్ కాలనీలోని సుమారు 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్ పట్టణ ఆరోగ్య కేంద్రం ద్వారా సమీప ప్రాంతంలోని 30వేల మందికి పైగా జనాభాకు వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి డాక్టర్, ముగ్గురు ఏఎన్ఎమ్లు, స్టాఫ్ నర్స్, డీవో, సూపర్వైజర్ సహా 11మంది వైద్యసిబ్బందితో పాటు 14మంది ఆశ వర్కర్లు పనిచేస్తుంటారు. స్థానికులకు నిరంతర వైద్యసేవలందించారు.
కాగా ఏడాది కాలంగా భవనానికి సంబంధించిన అద్దెను చెల్లించలేదు. దీంతో ఆరునెలల క్రితమే ఇంటి యజమాని భవనాన్ని ఖాళీ చేయాలంటూ జిల్లా వైద్యశాఖ అధికారులకు వరుస లేఖలు రాశాడు. అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పట్టణ ఆరోగ్య కేంద్రానికి యజమాని నీటి సరఫరాను ఆపేశాడు. దీంతో అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా అద్దె విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బంది పలుమార్లు వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో యజమాని ఇటీవల లీగల్ నోటీసు పంపించాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి అద్దె బకాయిని విడుదల చేయాల్సిన జిల్లా వైద్యాశాఖ అధికారులు వెంటనే పట్టణ ఆరోగ్యకేంద్రానికి తాళాలు వేసి సేవలు నిలిపివేయాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
సుమారు రెండున్నర లక్షల అద్దె బకాయిని చెల్లించలేమంటూ ఉన్నతాధికారులు చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక స్థానిక సిబ్బంది 3 రోజులుగా సేవలు నిలిపి తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ప్రముఖులు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌ను అనుకుని ఉన్న పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని షౌకత్నగర్ పట్ణణ ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగులను పక్కనున్న ఇందిరానగర్ బస్తీ దవాఖానాకు వెళ్లాలని పంపిచేస్తున్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో సుమారు 3వేలమందికి సేవలు అందిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని రూ.2.5లక్షల అద్దె బకాయిలు విడుదల చేయలేక మూసేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండునెలల క్రితమే జిల్లా వైద్యాధికారి డా.వెంకటి ఇక్కడ పరిస్థితిని పరిశీలించారు. సమస్యను పరిష్కరించి రోగులకు వైద్యసేవలు అందేలా చూడాల్సిన డా.వెంకటి ఏ మాత్రం స్పందించకపోవడంతో పాటు తాత్సారం చేయకుండా వెంటనే పీహెచ్ఎంసీని మూసేసి సిబ్బంది మొత్తం షౌకత్నగర్ పట్టణ ఆరోగ్యకేంద్రానికి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసినట్లు
తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అద్దె భవనంలో కొనసాగుతున్న జవహర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రానికి సొంత భవనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఆరునెలల క్రితమే రూ.1.43కోట్ల నిధులు మంజూరయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సమీపంలోని ఇందిరానగర్‌ను అనుకుని సుమారు 250 గజాల ప్రభుత్వ స్థలాన్ని కూడా 3 నెలల క్రితమే జిల్లా రెవెన్యూ అధికారులు కేటాయించారు. అయితే భవన నిర్మాణం ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అద్దె భవనంలోనే కొనసాగిన ఆరోగ్య కేంద్రం వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో మూసివేతకు సిద్దంగా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.