కంటోన్మెంట్, ఏప్రిల్ 9 : ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ విజయవంతంలో బస్తీ, వార్డు స్థాయి నాయకులు బాధ్యత తీసుకుకోవాలని కోరారు. సభకు బయలుదేరే రోజున ఉదయం నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో గులాబీ జెండా ఎగురవేసి డప్పు చప్పుళ్లు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
వారం రోజుల్లో బస్తీల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుందని తెలిపారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.