బోడుప్పల్, జూన్ 25: తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా పరుగులు పెట్టిన రియల్ ఎస్టేట్ రంగం.. సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్నారు.
కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో రియల్ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. బెంగళూరు, అమరావతి వంటి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంటే హైదరాబాద్‌లో మాత్రం హైడ్రా దెబ్బకు తిరోగమన దిశలో ఉందన్నారు. హైడ్రా దెబ్బకు దిగువ పేద, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే హడలిపోతున్నారన్నారు. నిజం కాలం నుంచి చెరువుకుంటల్లో పట్టాదారులుగా కొనసాగుతున్న రైతుల నుంచి ల్యాండ్ ఆక్విజేషన్ చేసి వారికి పునరావాసం కల్పించి చెరువుకుంటల బౌండరీలను నిర్ధారించి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలిచే రియల్ రంగానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.