పళ్లైన ప్రతి జంట తమకు పండంటి పిల్లలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ పలు అనారోగ్య కారణాల మూలంగా సంతానం కలగకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లలో అమ్మ అనే పిలుపుకోసం ఎంతో మంది తల్లులు ఆశతో ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి శాస్త్రీయ పద్ధతుల్లో సంతానోత్పత్తి కలిగేందుకు నాటీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లోనే కార్యాచరణ చేసింది. అందులో భాగంగానే రూ.16.5కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. గాంధీ జనరల్ ఆసుపత్రి, పేట్లబుర్జ్ మెటర్నిటీ దవాఖాన, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో కేంద్రానికి రూ.5.5 కోట్లు కేటాయించింది.
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): గాంధీ జనరల్ దవాఖానలోని ఎంసీహెచ్ విభాగంలో ఉన్న ఐదో అంతస్తులో సంతాన సాఫల్య కేంద్రాన్ని 2023లో హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ, సంతానం కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టి మరీ ప్రైవేట్ సంతాన సాఫల్యం కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది.
గాంధీలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రంలో ఇంట్రాయుటెరిన్ ఇన్సామినేషన్ (ఐయూఐ), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) శాస్త్రీయ పద్ధతుల్లో సంతానోత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రానికి 6,918 మంది బాధితులు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. అందులో 37 మందికి కేవలం మందులతోనే తమ సమస్యను అధిగమించారు. వారిలో ఇప్పటివరకు ముగ్గురు ప్రసవించగా, మిగతావారు గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు.
సంతానం కోసం వచ్చేవారికి ముందుగా కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ తరువాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చికిత్సనందిస్తున్నారు. సంతానోత్పత్తికోసం ముందుగా మందులు వాడాలని సూచిస్తారు. వాటివల్ల ఫలితం కనిపించకపోతే ఐయూఐ పద్ధతి ద్వారా గర్భాశయంలో ప్రత్యక్షంగా వీర్యాన్ని విడుదల చేస్తారు. ఇది సాధారణంగా అండోత్పత్తి సమయంలో చేస్తుండటం గమనార్హం. చాలా వరకు ఐయూఐతోనే పరిష్కారం దొరుకుతుంది.
కొందరికి ఇందులో కూడా ఫలితం కనిపించకపోతే ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకుంటారు. ఐవీఎఫ్ పద్ధతిలో శరీరంలో అండోత్పత్తిని మందులతో పెంచి, అండాన్ని సేకరిస్తారు. శుక్రకణాలతో అండాన్ని ల్యాబ్‌లో ఫలదీకరిస్తారు. మిగతా పరీక్షలు పూర్తిచేసినంతరం మహిళ గర్భంలోకి పంపిస్తారు. ఇప్పటివరకు ఐయూఐ చికిత్సకోసం 352 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా, ఐవీఎఫ్ కోసం 244 మంది నమోదు చేసుకున్నారు. ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాల్లో ఐవీఎఫ్ చేయించుకోవాలంటే సుమారు రూ.2.50లక్షలు వసూలు చేస్తున్న తరుణంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది వరంగా నిలుస్తుంది.