కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 23: కూకట్పల్లి నల్ల చెరువులో పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల భూములను హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… కూకట్పల్లి నల్ల చెరువు పూర్తి విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. అందులో 7.30 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ శిఖం భూమని, మిగిలిన భూమంతా ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఉన్నాయన్నారు.
ఈ పట్టాదారులకు చెందిన భూములకు ఎలాంటి నష్ట పరిహారం, టీడీఆర్ లాంటివి ఇవ్వకుండానే ఎలా స్వాధీనం చేసుకుంటారన్నారు. చెరువు ఎఫ్టీఎల్లోని పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కూల్చివేశారన్నారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించి, ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి చెరువుల విస్తీర్ణంపై చర్చించాలన్నారు.
ఆయా ప్రాంతాల్లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఆ చెరువు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, పట్టా భూములను గుర్తించాలని, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టతనివ్వాలన్నారు. ఆయా చెరువుల్లో ఎంతవరకు ఆక్రమణలు జరిగాయో తేల్చాలన్నారు. నగరంలో 600లకు పైగా చెరువులు ఉండగా.. నేడు 180 చెరువులు మాత్రమే కనిపిస్తున్నాయని, ఎవరి హయాంలో చెరువులు మాయమైపోయాయో సమాధానం చెప్పాలన్నారు.
చెరువులపై స్పష్టత లేని కారణంగా, కూకట్పల్లి ఖాజకుంటలో ఇద్దరు జడ్జిలు స్థలాలను కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారని, ఇక సామాన్యులకు ఎలా తెలుస్తుందన్నారు. శని, ఆదివారం వచ్చేసరికి హైడ్రామా సృష్టిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. హైడ్రా పేరుతో నగరంలోని చెరువులు, కాలువల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు భయంతో బతుకాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు.
హైకోర్టు ఆదేశాలతో..
కూకట్పల్లిలోని నల్ల చెరువును అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి పట్టా భూములు కలిగిన వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారని తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటించడం వల్లే అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. చెరువు సందరీకరణలో భాగంగా 2017లో రూ.రెండు కోట్లు వెచ్చించి చెరువు కట్టను ఏర్పాటు చేస్తే.. హైకోర్టు ఆదేశాలతో ఆ కట్టను రెండు రోజుల్లోనే తొలగించాల్సి వచ్చిందన్నారు. చెరువులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 50 కోట్లతో ఎస్టీపీ పనులను ప్రారంభిస్తే.. ఆ పనులు కూడా కోర్టు ఆదేశాలతో ముందుకు సాగలేదన్నారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ.. చెరువును అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
గంట టైమిస్తే కొంపలు కూలుతాయా..?
చెరువు ఎఫ్టీఎల్ స్థలమని తెలియని పేదలు.. కష్టార్జితంతో రేకుల షెడ్డులు నిర్మించుకున్నారని, ఆ షెడ్డులో పెట్టుకున్న విలువైన సామగ్రిని తీసుకోవడానికి ఓ గంట టైమిస్తే కొంపలేమైనా కూలుతాయా.. అని హైడ్రా అధికారులను ప్రశ్నించారు. మహబూబ్నగర్, సూర్యాపేట జిల్లాల నుంచి బతుకు దేరువు కోసం నగరానికి వచ్చారని, వారికి రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లారేసరికి కూల్చడం సరికాదని, వారికి సమయం ఇవ్వాలన్నారు. కూల్చివేతలతో రోడ్డున పడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారాన్ని అందించాలన్నారు. మీకూ భార్యాపిల్లలు ఉన్నారు.. ఇలాంటి చర్యలు మంచివికాదు.. అని అధికారుల తీరును విమర్శించారు.