GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు వరకు జీహెచ్ఎంసీని విస్తరించే ప్రక్రియకు అడుగులు పడినట్లు తెలిసింది. ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు ప్రత్యేకంగా ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఔటర్ లోపల ఉన్న 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలను బల్దియాలోకి విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమా చారం.
గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో విలీన ప్రక్రియ వేగవంతానికి సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 3న జరగనున్నట్లు సమాచారం. కాగా, రామచంద్రాపురం, ఐలాపూర్, కర్దనూర్,కృష్ణారెడ్డి పేట, ముత్తంగి, పోచారం, సుల్తాన్పూర్, కాచివాణి సింగారం, కొర్రెముల, పిర్జాదీగూడ, ప్రతాప సింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారమతిపేట, చేర్యాల, గోదాంకుంట, కీసర, రాంపల్లి, తిమ్మాయిపల్లి, మంకాల్,
గౌడవెల్లి, పుద్దూర్, మంచిరేవుల, బొమ్మరాసిపేట, గోడకండ్ల కలాన్, గోల్కొండ కుర్దు, హమిదుల్లా నగర్, జన్వాడ, పాటి తదితర గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కాగా, త్వరలోనే 20 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లకు సైతం జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు చర్యలను వేగిరం చేసినట్లు తెలిసింది.