సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర గడిచింది. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 10 నెలలు అవుతుంది. 1500కు పైగా ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం పట్టుబడి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ ఇంచు భూమిని కూడా చేజిక్కించుకోలేదు. వెరసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు, ప్రాజెక్టు భూసేకరణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ ప్రకటించే, ప్రారంభించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పురోగతి నత్తకు నడకలు నేర్పేవిధంగా ఉంటాయని చెప్పేందుకు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎలివేటెడ్ ప్రాజెక్టు బాధితులు లేవనెత్తుతున్న అంశాలను, వారి ఆవేదనను అటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్దలు కానీ, డిఫెన్స్ భూములిచ్చిన బీజేపీ కానీ పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడం లేదు.
అడ్డగోలుగా లాక్కునేందుకు
నగరం నుంచి నార్త్ తెలంగాణ రవాణా సదుపాయాలు మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు అత్యంత వివాదస్పద నిర్మాణంగా కాంగ్రెస్ సర్కారు మార్చేస్తోంది. భూములు కోల్పోతున్న బాధితులను వాదనలను పట్టించుకోకుండానే అడ్డగోలుగా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది.
దీంతో ప్రాజెక్టు కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ భూములను కాపాడుకునేలా, ప్రాజెక్టు కారణంగా జీవనాధారం కోల్పోతున్నామని చెబుతున్నా సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంలో ప్రభుత్వంలోని పెద్దలు, ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఆచితూచి అడుగు వేస్తున్నారు.
సంప్రదింపులున్నా.. ఫలితం శూన్యం
భూములు కోల్పోతున్న వందలాది మంది భూ యజమానులు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పర్యావసానాలు, ప్రాజెక్టు వలన వ్యక్తిగతం కలుగుతున్న నష్టాలతోపాటు, ప్రాజెక్టు డిజైన్లు మార్చడం వలన కలిగే ఇబ్బందులపై గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలను కలిసి వివరిస్తున్నారు. కానీ తమ ఆవేదనను అర్థం చేసుకుని, సమస్యకు పరిష్కారం చూపే నాయకులు లేరని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి బాధితుల వాదనను తీసుకెళ్లడంలో నాయకులు ఆసక్తి చూపడం లేదు.
కనీసం ప్రాజెక్టు నిర్మాణం కోసం పరిహారం విషయంలోనైనా ప్రభుత్వంతో చర్చించి న్యాయం జరిగేలా చూసే నాయకుడు కరువయ్యారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోనే తేల్చుకుంటామంటూ బాధితులు కూడా ప్రతి నాయకుడిని సంప్రదిస్తున్నారు. ప్రాజెక్టు కారణంగా జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. కానీ ఈ అంశంలో బాధితులకు మాత్రం ప్రయోజనం దేవుడెరుగు కనీసం తమకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేవారు కూడా లేకుండాపోయారని ఆవేదన చెందుతున్నారు.