IT Company | మాదాపూర్, ఫిబ్రవరి 21: నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీలు నిరుద్యోగులకు కుచ్చుటోపి వేస్తున్నాయి. ఉద్యోగం కొరకు వచ్చినవారు దిక్కుతోచని పరిస్థితిలో వేరే దారి లేక లక్షల్లో చెల్లించి మోసపోతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏడాదికి పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. తాజాగా ఓ ఐటి కంపెనీ ఉద్యోగం కొరకు వచ్చిన వద్ద లక్షల్లో వసూలు చేసి రోడ్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఏమి చేయాలో పాలుపోక న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్లోని పత్రిక నగర్లో కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీతో ప్రొటెక్ హై పేరుతో ఓ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గత పది నెలల క్రితం ఈ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి వారి వద్ద నుండి రూ. 1.5 నుండి 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ఉద్యోగం లో చేర్చుకున్నారు. 9 నెలలపాటు ఉద్యోగులతో పని చేయించుకుని వారికి మూడు నెలల వరకు మాత్రమే జీతాలు చెల్లించారు. మరో 6 నెలలు జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తుంది.
దీంతో బాధితులు కంపెనీ మేనేజ్మెంట్ ని ఇదేమిటని నిలదీసి అడగగా వారికి ఎక్స్పీరియన్స్ లెటర్ అందజేసి కంపెనీకి ప్రాజెక్టులు రావడం లేదు, జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పి తెలివిగా బుకాయించారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు మేము కట్టిన డబ్బులు కూడా ఇప్పటివరకు మాకు అందలేదని, కంపెనీ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.