సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. బడుగుజీవుల ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. వారి ఇళ్లు నేలమట్టం చేసింది. అదే సమయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు రేకులతో వేసిన ఫెన్సింగ్ కూల్చేసింది. అయితే పేదలు మాత్రం మళ్లీ తమ జాగల్లోకి వెళ్తే ఏమవుతుందోనని భయపడుతుంటే.. అధికారమే మా చేతిలో ఉంది..
మాకేం అడ్డు అనే ధోరణిలో సదరు ఎమ్మెల్యే కనబడుతుండటం…మళ్లీ ఫెన్సింగ్ వేసేందుకు యత్నిస్తున్నట్లు సదరు ఎమ్మెల్యే వర్గాల ద్వారా తెలుస్తోంది.. ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన హైడ్రా కమిషనర్…ఈ సర్వే నంబరులోనే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుటుంబం ఆధీనంలోకి వెళ్లిన 12 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంటుందా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గాజులరామారం కూల్చివేతలపై స్పందించిన కమిషనర్ రంగనాథ్ అసంపూర్తిగా ఉన్న 260 నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని, నిర్మాణం పూర్తిచేసుకుని నివాసం ఉంటున్న 640 నిర్మాణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాటిని కూడా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఐతే ఇదే సర్వే నంబర్లో రాజకీయ నేతలు ఉన్నారని, వారి విషయంలో మాత్రం ప్రభుత్వ దృష్టికి నివేదిక రూపంలో తీసుకెళ్తానని చెప్పడం…అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే విషయంలో ఏ మాత్రం జవాబుదారితనంగా హైడ్రా వ్యవహరిస్తుంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గాంధీ కబ్జా తాలుకా అంశం న్యాయస్థానంలో విచారణకు వచ్చిన తరుణంలోనే హైడ్రా కంటితుడుపు చర్యగా ఫెన్సింగ్‌ను కూల్చివేసి ఆ స్థలాన్ని రక్షిస్తున్నట్లు చూపిస్తున్నారని, కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ యథా స్థితిలోనే వెళ్తారన్న ప్రచారం లేకపోలేదు…మొత్తంగా గాంధీకి సంబంధించిన కబ్జా భాగోతంపై హైడ్రా రంగనాథ్ ఏ విధంగా వ్యవహరిస్తారు? సున్నం చెరువు విషయంలో పేదోళ్లపై ఏడాది కాలంగా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నట్లే గాంధీ విషయంలోనూ అలాగే నిలబడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
కాగా ఇదిలా ఉంటే సున్నం చెరువు ఎక్కడుందో తెలియకుండానే హైడ్రా తమ ఇళ్లు కూల్చేసిందంటూ సియేట్ సొసైటీ కోర్టుకెక్కింది. ఏ సర్వే నెంబర్లో చెరువు హద్దులు ఉంటాయో తెలియకున్నా.. అందులో ఇప్పటికీ సందిగ్దత నెలకొన్నా.. హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుపోతుందని…పేదలపైనే హైడ్రా ప్రతాపమే తప్ప పెద్దల జోలికి వెళ్లడం లేదని సియేట్కాలనీ వాసులు భగ్గుమంటున్నారు.
కంటి తుడుపు చర్యగానే అనుమానాలు
గాజులరామారంలోని సర్వే నంబరు 307తో పాటు ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లలో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సర్వే నంబరు 307లోనే 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది.
ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం..ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకుని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 12 ఎకరాల మేర ఆక్రమణలకు పాల్పడ్డాడు. 2023 జూన్ నెలలో సర్వే నెంబర్ 307బై/ఎ 2 ఎకరాలు, 307 ఎబై2లో 2 ఎకరాలు, 307 ఎ బై 1లో 1.02 ఎకరాలు, 307 ఎ బై 4లో 2 ఎకరాలు, 307 ఎ బై 5 0.12 గుంటలు, 307 ఎ బై 3 0.08 గుంటలు, 307 ఎ బై 6లో 1 ఎకరం, 307 ఎ బై 7లో 1 ఎకరాలు మరో ఇద్దరి పేరిట కుత్బుల్లాపూర్ తహశీల్దారు కార్యాలయంలో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చకచక జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుటుంబ సభ్యుల పేరిట 12 ఎకరాల ప్రభుత్వ భూమిని చేసిన రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి , కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావులు వేర్వేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణకు వచ్చిన తరుణంలో హైడ్రా అధికారులు ఎదో కంటి తుడుపు చర్యలలో భాగంగా 12 ఎకరాలకు వేసిన ఫెన్సింగ్ తొలగించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
నిరుపేదల ఇండ్లను కూల్చిన నేపథ్యంలో ఆగ్రహవేశాలు, తీవ్రంగా ప్రతిఘటనలు ఎదురవుతున్న క్రమంలో దృష్టి మర్చిలేందుకే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వేసిన భూమికి ఫెన్సింగ్‌ను తొలగించారని, సంబంధిత స్థలంలో నేటికీ ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాబోయే రోజుల్లో హైడ్రా అడుగులు ఎలా ఉంటాయన్న వేచి చూడాల్సిందే..!!