RS Praveen kumar | తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ చెప్పడమంటే ఆడవాళ్ల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు పెరుగుతాయని చెప్పడమేనా..? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, వారి కొడుకులు తెలంగాణలో ఆడవాళ్లకు, బాలికలకు భద్రత లేకుండా చేస్తారని చెప్పడమేనా..? అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నేరం చేశాడని తెలిసినా ఎందుకు తన కొడుకుని బండి సంజయ్ విచారణకు హాజరు పరచలేదు..? చెప్పాలన్నారు. రాష్ట్ర పోలీసులు ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకుకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం కంటే అవమానం ఇంకొకటి ఉంటుందా..? అది కూడా POCSO కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చి ఒక తీవ్రవాదిలాగా కేంద్ర మంత్రి కొడుకు కోసం రాష్ట్ర పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెతకడం కంటే సిగ్గు చేటు ఇంకోటి ఉంటుందా..? అన్నారు.
లుకౌట్ నోటీసులు ఇచ్చినా బండి సంజయ్ తన కొడుకు తప్పు చేశాడని ఎందుకు ఒప్పుకోవడం లేదు..? సొంత పార్టీ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేస్తేనే బాధితురాలికి న్యాయం చేయలేకపోయిన బీజేపీ, రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్ర మహిళలకు రక్షణ కల్పిస్తుందని ఏంటి నమ్మకం..? అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.