Digital Survey | మేడ్చల్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా పరిధిఓఆర్ఆర్ లోపల ఉన్న సుమారు 30 చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా డిజిటల్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే బఫర్, ఎఫ్‌టీఎల్‌లలో నిర్మాణాల లెక్క తేలుతుందని చెబుతున్నారు. ఉప్పల్, పీర్జాదిగూడ, బోడుప్పల్ చెరువుల సమీపంలో ఉన్న బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించినా.. మరోసారి డిజిటల్ సర్వే నిర్వహించి గూగుల్ మ్యాపుల్లో పొందుపరుస్తామని చెప్పారు.
బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల ఆధారంగా యజమానులకు నోటీసులు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే హైడ్రా పరిధిలోని చెరువులకు మాత్రమే మొదటి దశలో డిజిటల్ సర్వేను నిర్వహిస్తున్నారు. కాగా, మూసీ నిర్వాసితుల వినతులు, సమస్యలను తెలుసుకునేందుకు మేడ్చల్ కలెక్టరేట్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ మూసీ నిర్వాసితులకు ఎలాంటి ఉపయోగం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేస్తే స్పందించడం లేదన్న విమర్శలున్నాయి.